కేంద్ర ప్రభుత్వం.. ప్రజలకు ప్రకృతి సోయగాలను శాశ్వతంగా ఆస్వాదించేలా ఒక చట్ట సవరణ చేసింది. అది రియల్ ఎస్టేట్ వ్యాపారులకు కూడా మంచి శుభవార్తే కానుంది. వివరాల్లోకి వెళితే భారతదేశానికి ఉత్తరాన గల జమ్మూ కశ్మీర్‌ రాష్ట్రానికి ప్రత్యేక హోదా కల్పించే ఆర్టికల్ 370ను గతేడాది ఆగస్టు 5న రద్దుచేసిన కేంద్రం అలాగే జమ్మూ కాశ్మీర్ ను కేంద్ర పాలిత ప్రాంతంగా ప్రకటించింది.. ఇప్పుడు తాజాగా కేంద్రం మరో కీలక సవరణ చేసింది. ఆ సవరణ ప్రకారం ఇతర ప్రాంతాలకు చెందిన వ్యక్తులు ఎవరైనా సరే కాశ్మీర్‌లో భూములు కొనుగోలు చేయడం, ఇల్లు నిర్మించుకుని శాశ్వతంగా నివసించవచ్చు. జమ్మూ కాశ్మీర్‌ అభివృద్ధి చట్టం 17వ సెక్షన్‌ లో స్థానికేతరులు భూములు కొనుగోలు చేయకూడదనే కీలక నిబంధనను కేంద్ర హోం మంత్రిత్వ శాఖ సవరించింది. ఈ సవరణలు తక్షణమే అమల్లోకి వస్తాయని మంగళవారం తెలిపింది. అయితే వ్యవసాయ భూమిని సాగుచేసే వారు మాత్రమే కొనుగోలు చేయాలని జమ్మూ కశ్మీర్‌ లెఫ్టినెంట్‌ జనరల్‌ మనోజ్‌ సిన్హా వెల్లడించారు. అలాగే విద్య, వైద్య సంస్థల ఏర్పాటుకు సంబంధించి మినహాయింపులు ఇచ్చింది. ఇప్పుడు వ్యవసాయ భూములను సాగు చేయనివారు సైతం కొనుగోలు చేయవచ్చని పేర్కొనడం విశేషం. ఇదిలా ఉండగా కేంద్రం నిర్ణయంపై జమ్మూ కశ్మీర్‌లోని పార్టీలు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేస్తున్నాయి.

ఈ విషయమై మాజీ ముఖ్యమంత్రిఒమర్ అబ్దుల్లా తీవ్రంగా మండిపడ్డారు. కశ్మీర్‌ను అమ్మకానికి పెట్టారని, దీని వల్ల పేదలు నష్టపోతారని ఆగ్రహం వ్యక్తం చేశారు. అంతేకాదు, ఇది నిరంకుశ నిర్ణయంగా అభివర్ణించారు. ‘భూముల కొనుగోలుకు సంబంధించి ఆమోదయోగ్యం కాని సవరణలు చేశారు. దీనివల్ల వ్యవసాయేతర భూముల కొనుగోలు, వ్యవసాయ భూముల బదిలీ సులభంగా జరిగిపోతుంది. కశ్మీర్‌ అమ్మకానికి సిద్ధంగా ఉంది. దీని వల్ల పేదలు తీవ్రంగా నష్టపోతారు’ అని ఒమర్‌ అబ్దుల్లా ట్వీట్‌ చేశారు. కశ్మీర్‌ను దోచుకోడానికి రాజ్యాగ విరుద్ధంగా ఆర్టికల్‌ 370ని రద్దు చేసిన కేంద్రం.. ఇప్పుడు కశ్మీర్‌ను అమ్మేసేందుకు తాజా సవరణలు చేసిందని పీడీపీ నేత మెహబూబా ముఫ్తీ మండిపడ్డారు. ఇలాంటి నిరంకుశ నిర్ణయాలకు వ్యతిరేకంగా పోరాడేందుకు జమ్ము, కశ్మీర్‌, లడఖ్‌ వాసులంతా ఒక్కటవ్వాలని ఆమె పిలుపునిచ్చారు. జమ్మూకశ్మీర్‌లోని ఇతర పార్టీలు కూడా కేంద్ర ప్రభుత్వ నిర్ణయాన్ని తప్పుబట్టాయి. ప్రత్యేక హోదాను రద్దుచేసి జమ్మూ-కశ్మీర్‌, లడఖ్‌ కేంద్రపాలిత ప్రాంతాలుగా విభజించిన విషయం తెలిసిందే. భారత్ నిర్ణయంపై పాక్ తీవ్రంగా అభ్యంతరం వ్యక్తం చేస్తుండగా.. అంతర్జాతీయ సమాజం దాయాది వాదనలను తోసిపుచ్చుతోంది.

మరింత సమాచారం తెలుసుకోండి: