అమెరికా రక్షణ సంబంధాల్లో కొత్త అధ్యాయం మొదలైంది. భారత్‌, అమెరికా మధ్య భౌగోళిక- అంతరిక్ష సమాచారాన్ని పరస్పరం అందజేసుకునే ఒప్పందం కుదిరింది. బెకా పేరుతో పిలిచే ఈ ఒప్పందం ద్వారా, అత్యాధునిక సైనిక సాంకేతికత, వసతి కేంద్రాలతో పాటు అంతరిక్ష సంబంధిత మ్యాప్‌లను పరస్పరం వినియోగించుకునేందుకు వీలుంటుంది. అమెరికా ఉపగ్రహాలు, సెన్సర్లు సేకరించే సమాచారంతో పాటు.. భౌగోళిక, అంతరిక్ష సమాచారాన్ని భారత్‌తో పంచుకునేందుకు అవకాశముంటుంది.

హిమాలయ పర్వత ప్రాంతాల్లో శత్రుదేశ కదలికలకు సంబంధించిన నిర్దిష్ట సమాచారం పొందే అవకాశం ఇన్నాళ్లూ భారత్‌కు లేదు. ముఖ్యంగా తూర్పు లద్దాఖ్‌ లాంటి 14 వేల అడుగుల ఎత్తున ఉన్న యుద్ధక్షేత్రంలో సైనిక మోహరింపులను వెంటనే తెలుసుకునే వీలుండేది కాదు. స్థానిక ప్రజల ద్వారానో, ఇంటెలిజెన్స్‌ వర్గాల ద్వారానో కాస్త సమాచారం లభించేది. ఇకపై ఉపగ్రహ సమాచారం ద్వారా శత్రు కదలికలను ముందే పసిగట్టి భారత్‌ రక్షణ చర్యలు తీసుకునే వీలుంటుంది.

అమెరికా వివిధ దేశాలపై జరుపుతున్న వైమానిక దాడులకు ఉపగ్రహ ఛాయాచిత్రాలు, వీడియోలే ఆధారం. తనకు నమ్మకమైన మిత్రదేశంగా ఉన్న భారత్‌తో మరింత బంధం పెంచుకోవడానికి.. మన దేశానికి ఈ రహస్య సమాచారాన్ని చేరవేసేందుకు అమెరికా అంగీకరించింది. ఆ దేశ సైనిక ఉపగ్రహాలు పంపే సూక్ష్మ, కచ్చితమైన స్థల సంబంధ డేటా, వాటికి సంబంధించిన రేఖా చిత్రాలు, వీడియోలు, ఇతర మ్యాప్‌లను.. బెకా ద్వారా భారత్‌ నేరుగా పొందగలుగుతుంది. సరిహద్దుల్లో కవ్విస్తున్న దేశాల గుట్టు మొత్తాన్నీ.. అంటే.. ఎక్కడెక్కడ దళాల్ని మోహరించాయి? ట్యాంకులు, యుద్ధ సామగ్రి ఎంత దూరంలో ఉంది? తదితర సమాచారాన్ని.. అమెరికన్‌ ఉపగ్రహాలు రియల్‌ టైమ్‌లో భారత్‌కు పంపిస్తాయి. ఇలాంటి సమాచారం ద్వారా.. ఇకపై మన దేశం కూడా చైనా గానీ, పాక్‌ గానీ సరిహద్దులు దాటి వచ్చే లోపే.. తరిమికొట్టేందుకు అవకాశం ఉంటుంది. మొత్తానికి భారత్ అమెరికా మధ్య కీలక ఒప్పందం కుదిరింది.



మరింత సమాచారం తెలుసుకోండి: