రాహుల్ గాంధీ మారాలి...కాంగ్రెస్ నుంచి మరిన్ని వలసలు : భాజపా నాయకురాలు ఖుష్బూ

చెన్నై: రాహుల్ గాంధీ తన చుట్టూ లక్ష్మణ రేఖ గీసుకున్నారని భాజపా నాయకురాలు ఖుష్బూ అన్నారు. అందులోంచి బయటకి వచ్చి చూస్తే సమాజం ఎలా ఉందో కన్పిస్తుందన్నారు. రాహుల్ ప్రవర్తనలో మార్పు రాకుంటే కాంగ్రెస్ నుంచి మరిన్ని వలసలు వచ్చే అవకాశం ఉందని ఆమె అన్నారు. చైన్నైలో ఆమె బుధవారం మాట్లాడారు.

" తమిళనాడులో భాజపాకు ఆదరణ పెరుగుతోంది.2021 లో మేము ఇక్కడ అధికారంలోకి వస్తాం" అని ఆమె జోస్యం చెప్పారు. గత నెల వరకు కాంగ్రెస్ అధికార ప్రతినిధిగా కొనసాగిన ఈమె ఇటీవలే ఆ పార్టీకి రాజీనామా చేసిన విషయం తెలిసిందే. ఖుష్భూ మీడియాతో మాట్లాడుతూ " ఎవరికి తెలుసు ఎవరు గెలుస్తున్నారనే విషయం?నాలుగేళ్ళ నుంచి ఏఐఏడీఎంకే అధికారంలో ఉంది. ముఖ్యమంత్రి పళనిస్వామిపై వ్యతిరేకత ఏదీ నాకు కనిపించలేదు. ఈ ప్రభుత్వంతో ఇబ్బంది ఉందని ప్రజలెవరూ భావించట్లేదు. పైగా ఆ పార్టీతో మాకు సఖ్యత ఉంది" అని ఆమె అన్నారు. కాషాయ పార్టీ దక్షిణాదిలో బలం పెంచుకునేందుకు ప్రాంతీయ పార్టీలతో సన్నిహితంగా ఉండేందుకు మొగ్గుచూపుతోందన్నారు. స్వచ్ఛ భారత్, ఆత్మ నిర్బర్, ట్రిపుల్ తలాక్ వంటి వాటిని గొప్ప కార్యక్రమాలని ఆమె ప్రశంసించారు. కాంగ్రెస్ లో వున్నప్పుడు తాను కూడా సీఏఏని వ్యతిరేకించానని నిశితంగా పరిశీలిస్తే ఆ చట్టం వల్ల ఏ మతానికి ఇబ్బంది లేదని స్పష్టం చేశారు. ఇదిలా ఉండగా భాజపాలో ప్రస్తుతం ఆమెకి ఎలాంటి బాధ్యతలు  అప్పగించలేదు. తమిళనాడులో ప్రతి మూలకు భాజపాని తీసుకెళ్లడమే తన లక్ష్యమన్నారు. భాజపా అంటే హిందువులు, బ్రాహ్మణుల పార్టీ అనే అపవాదుని తొలగిస్తానని ఆమె అన్నారు. ఈ పార్టీ మైనార్టీలు, వెనకబడిన వర్గాల సంక్షేమాన్ని కాక్షించే పార్టీ అని అది ప్రజలందరికీ తెలియచెప్తానన్నారు.

  2021 తమిళనాడులో జరగనున్న ఎన్నికల్లో రెండు ప్రధాన పార్టీల అగ్రనాయకులు లేకుండానే ఎన్నికలు జరగనున్నాయి. దీంతో ఇరు పార్టీలకు ఎన్నికలు ప్రతిష్టాత్మకంగా మారనున్నాయి.



మరింత సమాచారం తెలుసుకోండి: