బీహార్ ఎన్నికలు ఇపుడు దేశంలోనే ఆసక్తిని కలిగిస్తున్నాయి. కరోనా నేపధ్యం ఒక వైపు ఉంది. మరి దేశంలో ఒక్కసారిగా ఆకలి, నిరుద్యోగం, పేదరికం పెరిగింది. అసలే బీహార్ అంటేనే పేద రాష్ట్రం అంటారు. ప్రపంచ చరిత్రలో ఎన్నడూ లేని విధంగా కరోనా విపత్తు వచ్చిపడింది. మొత్తానికి మొత్తం అతలాకుతలం చేసింది. మరి దీనికి జనాలు ఎవరి మీద పగ తీర్చుకుంటారు అన్నది ఇంటరెస్టింగ్ పాయింటే.

సాధారణంగా ప్రకృతి విపత్తులు వస్తాయి. వాటి వల్ల జనాలు నష్టపోతారు. కానీ విపక్షాలు మాత్రం అధికారంలో ఉన్న పార్టీనే నిందించి జనాలకు వారిని వ్యతిరేకులుగా చేస్తాయి. కరోనాను కూడా రాజకీయ పార్టీలు అలాగే వాడుకున్నాయి. అధికారంలో ఉన్న పార్టీలు అయితే ఉచితంగా కరోనా వ్యాక్సిన్ తీసుకువస్తామని చెప్పి జనాల మెప్పు పొందేలా చూశాయి.

ఇక బీహార్ లో మరో విశేషం ఉంది. ఇక్కడ పదిహేనేళ్ళ నుంచి ముఖ్యమంత్రిగా నితీష్ కుమారే కొనసాగుతున్నారు. ఆయన మీద ఎంతో కొంత వ్యతిరేకత ఉంటుంది అని అంచనా. అదే సమయంలో బీహార్ లో ప్రతిపక్ష కూటమి నుంచి లాలూ కుమారుడు తేజశ్వీ యాదవ్ నాయకత్వం వహిస్తున్నాడు. లాలూ లేకుండా జరుగుతున్న ఎన్నికలు ఇవి. దాంతో చాలా మంది ఓటర్ల తీర్పు మీద తమ అంచనాలు తాము వేసుకుంటున్నారు.

ఇవన్నీ ఇలా ఉంటే తొలి విడత పోలింగ్ ఇవాళ జరిగింది. 71 స్థానాలకు పోలింగ్ జరిగితే తొలి విడతలో ఎన్డీయే కూటమి 50కి పైగా స్థానాలు గెలుచుకుంటుందని ఆ కూటమిలో ఉన్న మాజీ ముఖ్యమంత్రి,  దళిత నేత మాంజీ చెబుతున్నారు. తమ కూటమి అద్భుతమైన విజయం సాధించి తీరుతుందని కూడా ఆయన అంటున్నారు. మరి ఇదే రకమైన అభిప్రాయంతో విపక్ష కూటమి కూడా ఉంది.మరి ఓటర్ల తీర్పు బాక్సుల్లో భద్రంగా ఉంది. ఎవరు విజేత అన్నది నవంబర్ 10న తేలనుంది. వెయిట్ అండ్ సీ.




మరింత సమాచారం తెలుసుకోండి: