నరసాపురం ఎంపీ రఘురామకృష్ణం రాజు వెనక్కి తగ్గేలా కనిపించడం లేదు. జగన్ ప్రభుత్వం టార్గెట్ చేసుకుని ఆయన రాజకీయం చేస్తూనే ఉన్నారు. వైసీపీ నుంచి ఎంపీగా గెలిచి అదే పార్టీకి వ్యతిరేకంగా రాజుగారు రాజకీయం చేస్తున్నారు. ఏపీకి రాకుండా ఢిల్లీలోనే ఉంటూ ప్రతిరోజూ రచ్చబండ పేరిట మీడియా సమావేశం ఏర్పాటు చేసి, జగన్ ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు గుప్పిస్తున్నారు. అలాగే జగన్ ప్రభుత్వాన్ని పదే పదే కులం, మతం ఆధారంగా టార్గెట్ చేస్తూ ముందుకెళుతున్నారు.

అసలు జగన్ ప్రభుత్వంలో ఆయన సొంత సామాజికవర్గం రెడ్డిలకే ఎక్కువ ప్రాధాన్యత ఉందని ఎప్పటి నుంచో విమర్శలు చేస్తున్నారు. ప్రభుత్వంలో ముఖ్యమైన పోస్టులు రెడ్డి వర్గానికే దక్కాయని ఆరోపణలు గుప్పిస్తున్నారు. జగన్ ప్రభుత్వం కొత్తగా ఏ రెడ్డి వ్యక్తికైనా పదవి ఇస్తే చాలు, సెటైర్లు వేసేస్తున్నారు. ఇలా కులం ఆధారంగా రాజుగారు రాజకీయం చేస్తూ జగన్‌ని దెబ్బకొట్టాలని చూస్తున్నారు.

అలాగే తాజాగా మతపరమైన రాజకీయం కూడా రాజుగారు మొదలుపెట్టారు. క్రిస్టియన్ మతం విచ్చలవిడిగా పెరుగుతుందని ఆరోపణలు గుప్పిస్తున్నారు. సీఎం జగన్ క్రిస్టియన్ అని అందుకే ఏపీలో అదే మతం పెరుగుతుందని విమర్శలు చేస్తున్నారు. తాజాగా కూడా ఏపీలో యథేచ్ఛగా రాజ్యాంగ ఉల్లంఘన జరుగుతోందంటూ ప్రధాని మోదీకి రఘురామకృష్ణ లేఖ రాశారు.

రాష్ట్రంలో 30 వేల మంది చర్చి ఫాస్టర్లకు నెలకు రు.5 వేలు ఇవ్వడాన్ని తప్పుబట్టారు. అలాగే ప్రజల డబ్బును క్రిస్టియన్ మత వ్యాప్తికి ఉపయోగించడం రాజ్యాంగ నియమాలను ఉల్లంఘించడమేనని, 2011లో 1.8శాతం ఉన్న క్రిస్టియన్ జనాభా... ఇప్పుడు 25 శాతం వరకు మత మార్పిడి ద్వారా పెరిగిందన్నారు. దీనికి సంబంధించి అధికారికంగా లెక్కలు లేవని చెప్పారు. అంటే రాజుగారు పక్కాగా జగన్ ప్రభుత్వాన్ని ఏదొరకంగా ఇబ్బంది పెట్టాలనే ఉద్దేశంతోనే ఇలా కులం, మతాన్ని తీసుకొచ్చి విమర్శలు చేస్తున్నట్లు కనిపిస్తోంది. అయితే ఈయన విమర్శలని ప్రజలు పెద్దగా పట్టించుకోవడం లేదని తెలుస్తోంది.

మరింత సమాచారం తెలుసుకోండి: