మీతో మోదీ టీ తాగారా?
నిరుద్యోగం గురించి ప్రధాని మాట్లాడరేంటి?
బీహార్ ఎన్నికల ర్యాలీలో రాహుల్ గాంధీ వ్యాఖ్యలు

బీహార్: ప్రధాని మోదీ వలస కార్మికుల్ని పట్టించుకోలేదని, నిరుద్యోగ సమస్యపై నోరు ఎత్తరని రాహుల్ గాంధీ మండిపడ్డారు. బీహార్ లో జరగనున్న మొదటి దశ ఎన్నికల ప్రచారంలో భాగంగా పశ్చిమ చంపారన్ జిల్లాలో నిర్వహించిన ర్యాలీలో ఆయన పాల్గొన్నారు. ఆయన మాట్లాడుతూ భాజపా-జేడీయూ కలిసి రాష్ట్రాన్ని నాశనం చేయాలని చూస్తున్నాయన్నారు. "ప్రధాని గతంలో ఇక్కడికి వచ్చి చక్కెర పరిశ్రమని ఏర్పాటు చేస్తానని హామీ ఇచ్చారు. మీ అందరితో కలిసి టీ తాగుతానన్నారు. ఆయన మీతో కలిసి టీ తాగారా?" అని బీహార్ వాసులని ప్రశ్నించారు. దసరా సందర్భంగా ప్రధాని దిష్టిబొమ్మల్ని పలు ప్రాంతాల్లో కాల్చిన విషయం మనకి తెలుసన్నారు. ఇది దేశానికి ఏ మాత్రం మంచిది కాదని ఆయన అభిప్రాయపడ్డారు. దీన్ని బట్టి పంజాబ్ రైతులకు ప్రధానిపై ఉన్న వ్యతిరేకత మనకు స్పష్టంగా అర్థమవుతోందన్నారు. " 2006 లో నితీష్ బీహార్ కు ఎం చేశారో ప్రధాని కూడా పంజాబ్ కు మిగిలిన ప్రాంతాలకు అదే చేస్తున్నారు" అని వివాదాస్పద వ్యవసాయ చట్టాలని ఉద్దేశించి విమర్శించారు.

బీహార్ లో నిరుద్యోగాన్ని ప్రస్తావిస్తూ " కొద్ధి రోజులుగా ప్రధాని ఉద్యోగాల ఊసెత్తడం లేదు. ఎందుకంటే బీహార్ ప్రజలు ఆయన  చెప్పే అబద్దాల్ని ఇక నమ్మరు. కాంగ్రెస్ కేంద్రంలో దశాబ్దాల పాటు అధికారంలో ఉంది. ఎలా పరిపాలించాలో మాకు తెలుసు. అధికారంలోకి వచ్చేందుకు సులువైన మార్గాలు ఉన్నాయి. కానీ మేము అలా అబద్ధాలు చెప్పం" అని అన్నారు.

"ఎందుకు బీహారీలు ఉపాధి కోసం వేరే రాష్ట్రాలకి వెళ్తున్నారు? మన చెల్లెల్లు, తమ్ముళ్లకు నైపుణ్యాలు లేవా? కాదు. మన ప్రధానికి,ముఖ్యమంత్రికే లేవు" అని విమర్శించారు.  నోట్ల రద్దు, లాక్ డౌన్ ప్రకటన రెండూ ఒకే విధంగా జరిగాయన్నారు. వీటి వల్ల  మధ్య తరగతి, పేద ప్రజలకే ఎక్కువ నష్టం జరిగిందన్నారు. అదే సమయంలో కార్పొరేట్లకు మేలు జరిగిందని అన్నారు.

బీహార్ లోని పలు ప్రాంతాల్లో రాహుల్ పర్యటించారు. కాంగ్రెస్ శ్రేణుల్లో ఉత్సాహం నింపేందుకు మొదటి విడత ఎన్నికల ప్రచారాన్ని ఆయన ముందుండి నడిపిస్తున్నారు. 

మరింత సమాచారం తెలుసుకోండి: