బీహార్‌ అసెంబ్లీ ఎన్నికల్లో తొలి దశ పోలింగ్‌ ముగిసింది. 51.91 శాతం పోలింగ్‌ నమోదయ్యింది. మొదటి దశలో 6 జిల్లాల్లోని 71 స్థానాలకు ఎన్నికలు నిర్వహించారు. కరోనా నిబంధనల మధ్య ప్రజలు తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు.

బీహార్‌లో కరోనా యాక్టివ్ కేసులు దాదాపు పది వేలు ఉన్నా ప్రజలు లెక్కచేయకుండా.. అసెంబ్లీ ఎన్నికల తొలిదశ పోలింగ్‌ లో భారీగా పాల్గొన్నారు.  అన్ని పోలింగ్ కేంద్రాల దగ్గరా ఉదయం నుంచే ఓటర్లు బారులు తీరి కనిపించారు.  ఓటింగ్‌లో మాస్క్ తప్పనిసరి చేశారు. వచ్చిన ఓటర్లందరినీ థెర్మల్ స్క్రీనింగ్ చేశారు. కరోనా లక్షణాలు ఉన్న వారు, 80 ఏళ్లకు పైబడిన వారు పోస్ట్ బ్యాలెట్ వినియోగించుకునే అవకాశం కల్పించారు.

తొలి విడతలో మొత్తం 71స్థానాలకు నిర్వహించిన పోలింగ్  ప్రశాంతంగా ముగిసింది. నక్సల్ ప్రభావిత జిల్లాలైన గయా, రోహ్తాస్, ఔరంగాబాద్  లో  భారీ భద్రత నడుమ పోలింగ్ నిర్వహించారు. మొత్తం 6 జిలాల్లో పోలింగ్ జరిగింది. 71 నియోజకవర్గాల నుంచి  మొత్తం ఒక వెయ్యి 66 మంది అభ్యర్థులు పోటీ పడ్డారు. 71 స్థానాల్లో ఆర్జేడీ నుంచి 42 మంది, జేడీయూ నుంచి 41 మంది, బీజేపీ  నుంచి 29, కాంగ్రెస్ నుంచి 21 మంది, ఎల్జీపీ నుంచి 41 మంది అభ్యర్థులు పోటీలో ఉన్నారు.

రెండో విడతగా నవంబరు 3న 94 స్థానాలకు, నవంబరు 7న మూడో విడతలో 78 స్థానాలకు ఎన్నికలు జరపనున్నారు.  నవంబర్ 10న ఓట్ల లెక్కింపు పక్రియ నిర్వహించి, ఫలితాలను వెల్లడిస్తారు. ఈ సారి ఎన్డీఏ తరఫున ప్రధాని నరేంద్ర మోడీ, ప్రస్తుత ముఖ్యమంత్రి నితీష్ కుమార్ తదితరులు ప్రచారం చేశారు. కాంగ్రెస్, ఆర్జేడీ, వామపక్షాల కూటమి తరపున కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ, తేజశ్వి ప్రసాద్ యాదవ్  ప్రచారంలో పాల్గొన్నారు.  ఓటర్ల తీర్పుపై అందరిలో ఉత్కంఠ నెలకొంది.
మొత్తానికి బీహార్ ఎన్నికల తొలి దశ పోలింగ్ ముగిసింది.




మరింత సమాచారం తెలుసుకోండి: