మరో నాలుగు రోజులు మాత్రమే గడువు ఉండటంతో.. దుబ్బాక ఉపఎన్నికల ప్రచారం మరింత వేడెక్కింది. పోటాపోటీగా ప్రధాన పార్టీలు ఎలక్షన్ క్యాంపెయిన్ నిర్వహిస్తున్నాయి. రోడ్ షోలు, ఇంటింటి ప్రచారాలతో దూసుకుపోతున్నారు నేతలు.  టీఆర్ఎస్, కాంగ్రెస్, బీజేపీ నేతల మధ్య మాటల తూటాలు పేలుతున్నాయి. మరోవైపు దుబ్బాకలో నోట్లకట్టల వివాదంతో ఉపఎన్నికకు ప్రత్యేక పరిశీలకుడిగా.. తమిళనాడుకు చెందిన ఐపీఎస్ అధికారిని నియమించారు.

దుబ్బాక ఎన్నికల ప్రచారం తుది దశకు చేరుకుంటోంది. నవంబర్ 1వ తేదీతో ఎన్నికల ప్రచార గడువు ముగియనుంది. దీంతో అన్ని పార్టీలు స్పీడ్ పెంచాయి. కాంగ్రెస్ అంటే కాలిపోయే మోటార్లు....బీజేపీ అంటే బావుల దగ్గర మీటర్లు అని మంత్రి హరీష్ రావు ఎద్దేవా చేశారు. దుబ్బాక నియోజకవర్గంలోని అప్పనపల్లి గ్రామంలో ఎన్నికల ప్రచారం లో మంత్రి పాల్గొన్నారు.  మంగళహారతులు, బతుకమ్మ, బోనాలతో మంత్రికి ఘనస్వాగతం పలికారు.

దుబ్బాక స్థానాన్ని నిలబెట్టుకుంటామన్నారు మంత్రి కేటీఆర్. ముమ్మాటికీ దుబ్బాకలో మంచి మెజార్టీతో గెలుస్తున్నామన్నారు. విపక్షాలకు దుబ్బాకలో డిపాజిట్లు గల్లంతైనా ఆశ్చర్యపడక్కరలేదన్నారు. బీజేపీనేతలు పోలీసులపై మాట్లాడిన భాషను ఖండిస్తున్నామన్నారు.

అటు దుబ్బాక కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి శ్రీనివాస్ రెడ్డికి మద్దతుగా .. ఆ పార్టీ అగ్రనేతలు...ప్రచారం నిర్వహించారు. అసెంబ్లీలో ప్రభుత్వాన్ని నిలదీయడానికి తానున్నానని, తనకు తోడుగా ప్రజల సమస్యలపై గళమెత్తేందుకు శ్రీనివాస్ రెడ్డిని గెలిపించాలని భట్టి విక్రమార్క పిలుపు ఇచ్చారు.

సిద్దిపేటతో పాటు దుబ్బాక నియోజకవర్గంలో భారీ సంఖ్యలో పోలీసు, ఆర్మ్​డ్​  బలగాలను రంగంలోకి దింపుతున్నారు.  దుబ్బాక అసెంబ్లీ సెగ్మెంట్ లో ఇప్పటికే స్పెషల్​ పోలీస్​ టీమ్​లు పనిచేస్తుండగా.. కీలక ప్రాంతాల్లో ఇంకా పెద్ద ఎత్తున పోలీసులను మోహరిస్తున్నారు. మొత్తానికి దుబ్బాక ఎన్నికల ప్రచారం చివరి దశకు చేరుకుంది. అధికార, ప్రతిపక్ష పార్టీ నేతలు మాటల తూటాలు పేల్చుకుంటున్నారు. నువ్వెంత అంటే.. నువ్వెంత అంటూ రాజకీయాల్లో వేడి పుట్టిస్తున్నారు.
ఓటర్లను తమదైన శైలిలో  ఆకట్టుకుంటున్నారు. చూద్దాం.. త్వరలో గెలుపెవరిదో.





మరింత సమాచారం తెలుసుకోండి: