ఢిల్లీ కాలుష్యానికి వాహనాలు, పరిశ్రమలు  ఓ కారణమైతే  పొరుగు రాష్ట్రాలైన హర్యానా, పంజాబ్‌లలో పంటలు తగలబెట్టడం మరో కారణం. సాధారణంగా ఓ పంట పూర్తయిన తరువాత మరో పంట వేయడానికి దక్షిణాది రైతులకు, ఉత్తరాది రైతులకు తేడా ఉంటుంది. దక్షిణాది రైతులు కూలీలతో పొలం దుక్కి దున్ని కొత్త పంట వేస్తుంటారు. కానీ ఉత్తరాది రైతులు మాత్రం ఖర్చులు మిగుల్చుకునే క్రమంలో పంట వ్యర్థాల్ని కాల్చి వేస్తుంటారు. ఏటా ఖరీఫ్ పంట చేతికొచ్చాక రీబీ వేసే ముందు మాగాణిలో వరికుప్పలు తగలబెడుతున్నారు రైతులు. ఢిల్లీ నగరానికి సమీపంలో హర్యానా, పంజాబ్‌లోని గ్రామాలు ఉన్నాయి. అక్కడి పొగంతా ఢిల్లీ వైపు వస్తోంది. దీంతో ఢిల్లీ గ్యాస్‌ ఛాంబర్‌లా మారుతోంది.

ఇది చాలదన్నట్టు ఇటీవల కేంద్ర ప్రభుత్వం రూపొందించిన రైతు చట్టాలను వ్యతిరేకిస్తూ పంజాబ్‌, హర్యాణా రాష్ట్రాల రైతులు పెద్ద ఎత్తున నిరసనలకు దిగుతున్నారు. దీనిలో భాగంగా పంట వ్యర్థాలను భారీ ఎత్తున తగులబెడుతున్నారు. ఈ పొగంతా ఢిల్లీని తాకి ఉక్కిరిబిక్కిరిచేస్తోంది. పంట వ్యర్థాల కాల్చివేతతో పాటు దసరా, దీపావళి పండుగల సందర్భంగా బాణాసంచాలు కాల్చడం కూడా కాలుష్యం పెరుగుదలకు కారణం అవుతున్నాయి. మరి కొన్నిరోజుల్లో ప్రారంభమయ్యే వరికొయ్యల దహనంతో కాలుష్యం మరింతగా పెరిగే అవకాశమూ ఉంది.  ప్రస్తుతం పంజాబ్, హర్యానా ప్రాంతాల్లో ఏక్యూఐ 882గా ఉందని ఎర్త్ సైన్సెస్ ఎయిర్ క్వాలిటీ మానిటరింగ్ సంస్థ తెలిపింది. గాలిలోని నాణ్యతపై గడ్డి దహనం ప్రబావం గణనీయంగానే ఉందని ఈ సంస్థ వెల్లడించింది.

కరోనాకు ముందు ఢిల్లీలో రోజూ వెయ్యి కొత్త వాహనాలు రోడ్ల మీదకు వచ్చాయి. పదిహేనేళ్లు దాటిన వాహనాలను పక్కకు పెట్టాలన్న నిబంధనలున్నా పట్టించుకునే నాథుడే లేరు. ఇక పరిశ్రమల నుంచి వచ్చే కాలుష్యం సంగతి సరే సరి. అధికారుల అలసత్వం లంచగొండితనంతో ఇది నానాటికీ పెరగడమే తప్ప తగ్గటమే లేదు. దీంతో ఢిల్లీ కాలుష్యకోరల్లో పూర్తిగా కూరుకుపోయింది. ఈ ఏడాది వాయు కాలుష్యం మరింత పెరిగే అవకాశం ఉందని నిపుణులు హెచ్చరిస్తున్నారు.


మరింత సమాచారం తెలుసుకోండి: