విదేశీయులు ఢిల్లీకి రావాలంటేనే హడలిపోతున్నారు. వాయుకాలుష్యం కారణంగా ఇప్పటికే ఇక్కడ నివసిస్తున్న వారి గుండె, ఊపిరితిత్తులు చాలా బలహీనంగా మారాయి. ఈ పరిస్థితి ఇలాగే కొనసాగితే భవిష్యత్ ప్రశ్నార్థకం అవుతోంది. పరిశ్రమలు, వాహనాల నుంచి వచ్చే పొగ ద్వారా ఏర్పడే వాయు కాలుష్యంతో శ్వాసకోశ వ్యాధులే కాదు.. లంగ్ కేన్సర్ లాంటి ప్రాణాంతక వ్యాధులొస్తున్నాయి. పెద్దలు, చిన్నారుల జీవితాలతో ఈ కాలుష్యం ఆడుకుంటోంది.

ఢిల్లీ మహానగరంలోని లక్షలాది మంది విద్యార్ధుల్లో సగానికి సగం మందికి ఊపిరితిత్తులు పాడైపోయాయని అంచనా. సిగరెట్, బీడీ తాగకుండానే వీళ్ల ఊపిరితిత్తులు సర్వనాశనమై పోయినట్టు చెబుతున్నారు డాక్టర్లు. ఇవేం కాకిలెక్కలు కావు.. 2012లో పొగాకు వాడకంకన్నా పొల్యూషన్ కారణంగా పది లక్షల మంది ఎక్కువగా చనిపోయినట్టు చెబుతున్నాయి డబ్ల్యూహెచ్ ఓ  గణాంకాలు. అభివృద్ధి చెందుతున్న దేశాల్లో చనిపోతున్న వాళ్లలో కాలుష్యం కారణంగా 88శాతం మంది బలవుతుంటే ఒక్క ఢిల్లీలోనే ఇప్పటి వరకు 70 లక్షల మంది చనిపోయారంటోంది వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్.

రెడ్ లైట్ ఆన్ - గాడి ఆఫ్ అనే నినాదంతో ప్రజలకు అవగాహన కల్పించే కార్యక్రమం చేపట్టింది ఢిల్లీ ప్రభుత్వం. సివిల్ డిఫెన్స్ అనే స్వచ్చంధ సేవాసంస్థకు చెందిన సుమారు 3 వేల మంది కార్యకర్తలు నగరంలోని అన్ని రహదారుల కూడళ్ల వద్ద నినాదాలతో కూడిన అట్టముక్కలను ప్రదర్శిస్తూ విస్తృత ప్రచారం చేస్తున్నారు. కాలుష్యంపై యుద్ధం అంటూ పెద్ద ఎత్తున  చైతన్య కార్యక్రమం చేపట్టారు.

కాలుష్యాన్ని హరించే చెట్లను నీటితో కడిగే కార్యక్రమం ఢిల్లీలో  ముమ్మరంగా కొనసాగుతోంది. చెట్ల ఆకులపై నీళ్లను వెదజల్లే కార్యక్రమాన్ని ఢిల్లీ ప్రభుత్వం, మునిసిపాలిటీలు కొన్నిరోజులుగా ముమ్మరం చేశాయి. దేశ రాజధానిలో  పలు నిర్మాణాల వల్ల చుట్టుపక్కల చెట్ల ఆకులపై దట్టంగా పేరుకుపోయున దుమ్ము, ధూళిని తొలగించేందుకు యాంటీ డస్ట్ గన్స్ అనే నీటిని వెదజల్లే యంత్రాలను ఉపయోగిస్తున్నారు. 20 నుంచి 25 మీటర్ల దూరం వరకు తీవ్రమైన వేగంతో  నీటిని వెదజల్లడం ద్వారా చెట్ల ఆకులపై ఉన్న దుమ్ము తొలగిపోతోంది. దాంతో చెట్ల ఆకులు నుంచి విడుదలయ్యే ఆక్సిజన్ వల్ల కాలుష్య తీవ్రతను తగ్గించాలన్నదే ఆలోచన.

మరింత సమాచారం తెలుసుకోండి: