పాకిస్థాన్‌ మిత్ర దేశం భారత్ కు దీపావళి గిఫ్ట్ ఇచ్చింది. ఈ హఠాత్ పరిణామంతో పాకిస్థాన్ కు భారీ షాక్ తగిలినట్లయింది.  వివరాల్లోకి వెళితే పాక్ మ్యాప్‌ నుంచి పీవోకే (పాక్ ఆక్రమిత కశ్మీర్‌), గిల్గిట్‌-బాల్టిస్థాన్‌ను తొలగించింది. నవంబర్‌లో సౌదీలో G-20 శిఖరాగ్ర సమావేశం జరగనుండగా ఇలాంటి నిర్ణయం తీసుకోవడం పాకిస్థాన్‌కు గట్టి దెబ్బే. జీ-20 సమావేశాలను పురస్కరించుకొని సౌదీ ప్రభుత్వం ప్రత్యేకంగా ముద్రించిన ఓ నోటును విడుదల చేసింది. ఆ నోట్‌ వెనకాల జీ 20 దేశాల మ్యాపులను ముద్రించారు. వాటిలో పాక్ మ్యాపులో కశ్మీర్‌తో పాటు గిల్గిట్‌-బాల్టిస్థాన్ ప్రాంతాలను తొలగించారు.

సౌదీ ప్రభుత్వం విడుదల చేసిన నోటులోని మ్యాప్‌లో పీవోకేతో పాటు గిల్గిట్‌-బాల్టిస్థాన్ ప్రాంతాలు స్వతంత్ర దేశాలుగా పేర్కొన్నారు. సౌదీ ప్రభుత్వ నిర్ణయంపై పీవోకేలో కొంత మంది హర్షాతిరేకాలు వ్యక్తం చేస్తున్నారు. ‘సౌదీ అరేబియా ప్రభుత్వం భారత్‌కు దీపావళి గిఫ్ట్ ఇచ్చింది. పాకిస్థాన్ మ్యాప్ నుంచి PoK, గిల్గిట్-బాల్టిస్థాన్ ప్రాంతాలను తొలగించింది’ అంటూ పాక్ ఆక్రమిత కశ్మీర్‌ యాక్టివిస్ట్ అంజాద్ ఆయుబ్ మీర్జా బుధవారం (అక్టోబర్ 28) ట్వీట్ చేశారు. అయితే.. పాక్ ప్రభుత్వం మాత్రం ఈ అంశంపై ఇప్పటివరకు నోరు మెదకపోవడం గమనార్హం.

నవంబర్ 21, 22న రియాద్ వేదికగా G-20 సమావేశాలు జరుగనున్నాయి. ఈ సమావేశాలకు సౌదీ అరేబియా ప్రభుత్వం, ప్రిన్స్ సల్మాన్ అధ్యక్షత వహించనున్నారు. ఈ సమావేశాలకు గుర్తుగా అక్టోబర్ 24న సౌదీ ప్రభుత్వం ‘20 రియాల్స్’ బ్యాంక్ నోటును విడుదల చేశారు. ఆ నోటు ముందు భాగంలో సౌదీ రాజు సల్మాన్ బిన్ అబ్దుల్ అజీజ్ ఫొటోను ముద్రించారు. దాని కింద ఓ నినాదం ఉంది. రెండో వైపున ప్రపంచపటం ముద్రించి, అందులో జీ-20 దేశాలను ప్రత్యేక రంగుల్లో చూపించారు.

నరేంద్ర మోదీ అధికారంలోకి వచ్చిన తర్వాత సౌదీ అరేబియా, ఇజ్రాయెల్‌ తదితర దేశాలతో భారత్‌ ద్వైపాక్షిక సంబంధాలను మరింత బలోపేతం చేసుకుంది. సౌదీ ప్రిన్స్ సల్మాన్ తన విదేశాంగ విధానాన్ని మార్చుకుని భారత్‌కు అత్యంత ప్రాధాన్యం ఇస్తోంది. పాక్ ప్రధాని స్వయంగా విజ్ఞప్తి చేసినా.. కశ్మీర్‌ అంశంపై భారత్‌కు వ్యతిరేకంగా ఒక్క మాట కూడా మాట్లాడలేదు. అంతేకాదు, పలు అంతర్జాతీయ అంశాల్లోనూ భారత్‌కు మద్దతు పలుకుతూ పాక్‌కు షాకిస్తోంది. సౌదీ ప్రభుత్వం దారిలోనే ఇతర అరబ్ దేశాలు కూడా భారత్‌కు సానుకూలంగా వ్యవహరిస్తుండటం మరో కీలక పరిణామం. ఇది పాకిస్థాన్‌ను ఉక్కిరిబిక్కిరి చేస్తోంది. భారత్‌కు వ్యతిరేకంగా కొత్త శక్తులను కూడగట్టే పనిలో పడింది. చైనా ప్రోద్బలంతో టర్కీతో కలిసి కొత్త సమూహం ఏర్పాటు చేయడానికి పాక్ ప్రయత్నిస్తున్నట్లు వార్తలు వస్తున్నాయి. భారత్ సహా అమెరికా, ఇజ్రాయెల్‌, సౌదీ అరేబియా ప్రభుత్వాలు ఈ పరిణామాలను జాగ్రత్తగా గమనిస్తున్నాయి.



మరింత సమాచారం తెలుసుకోండి: