విశాఖలో మోడ్రన్‌ ట్రామ్‌ రైల్‌ నిర్మాణం.. మూడు కారిడార్లలో 60. 20 కిలోమీటర్లలో ఏర్పాటు కానుంది. ఎన్ఏడి - పెందుర్తి, స్టీల్ ప్లాంట్ గేటు - అనకాపల్లి , పాత పోస్టాఫీసు- భీమిలి బీచ్ రోడ్డు వయా రుషికొండ వరకూ వీటిని నిర్మిస్తారు. లైట్ మెట్రో ప్రాజెక్టు డెవలప్మెంట్ కు సంబంధించిన టెండర్ల ప్రక్రియను నవంబర్‌లో ప్రారంభించనున్నామని , అర్హతలున్నడెవలపర్ల ఎంపిక , కాంట్రాక్టర్ల సంతకం ప్రక్రియలన్నీ మార్చి 2021నాటికి పూర్తి చేయాలని మెట్రో కార్పొరేషన్ భావిస్తోంది.

స్టీల్ ప్లాంట్ నుంచి కొమ్మాది... కొమ్మాది నుంచి భోగాపురం.. తాడిచెట్ల పాలెం నుంచి బీచ్ రోడ్డు... గురుద్వారా జంక్షన్ నుంచి ఓల్డ్ పోస్టాఫీస్ వరకు... మొత్తం 75కిలోమీటర్ల పరిధిలో వీటిని రూపొందిస్తున్నారు. ప్రధాన కారిడార్ 16వ నెంబర్ జాతీయ రహదారిపై సిటీకి మధ్య నుంచి వెళ్తోంది. మల్టీ మోడల్ ట్రాన్సిట్ కంపెనీ-యూఎంటీసీ చేతిలో రూపుదిద్దుకుంటున్న డీపీఆర్‌లు తుది దశకు చేరుకున్నాయి. 2027నాటికి నాలుగు కారిడార్లలో లైట్‌మెట్రోను పట్టాలెక్కించాలని ప్రభుత్వం పట్టుదలతో వుంది. ఇందుకు సంబంధించిన అంచనాల రూపకల్పనలో ఆంధ్రప్రదేశ్ మెట్రో రైల్‌ కార్పొరే షన్‌ నిమగ్నమైంది. ట్రాఫిక్ స్టడీస్ ఆధారంగా మెట్రో పరుగులు ప్రారంభమయ్యేనాటికి ప్రయాణీకుల సంఖ్య ఆరు లక్షలుగా అంచనా వేశారు.

లైట్ మెట్రో ప్రాజెక్ట్ తొలిదశను 2027 నాటికి పూర్తి చేయాలని ప్రభుత్వం భావిస్తోంది. స్టీల్ ప్లాంట్-భోగాపురం మధ్య ఏర్పాటు కానున్న కారిడార్ పనులు మొదట ప్రారంభమయ్యేందుకు అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. మలిదశలో సుందర విశాఖ రహదారులపై మోడ్రన్ ట్రామ్ రైళ్ళు పరుగులు పెట్టనున్నాయ్. విద్యుదయస్కాంత శక్తితో నడిచే ట్రాక్‌లెస్‌ ట్రామ్‌ కార్‌ రైలు వ్యవస్థ... సెన్సార్‌ సిగ్నల్‌ విధానంతో వర్చువల్‌ ట్రాక్‌ ఆధారంగా నడుస్తుంది. ప్రజారవాణా కోసమే వీటిని ఏర్పాటు చేస్తున్నప్పటికీ పర్యాటకంగా ప్రత్యేక ఆకర్షణగా నిలవనున్నాయి. ఆర్కేబీచ్ మీదుగా భీమునిపట్టణం వరకూ వున్న కారిడార్లో ట్రామ్ పరుగులు ప్రారంభమైతే పర్యాటకానికి కొత్త ఊపు వస్తుంది.


మరింత సమాచారం తెలుసుకోండి: