చంద్రుడిపై నీటి జాడకు సంబంధించి కొత్త సమాచారం తెలిసింది. నాసా సోఫియా టెలిస్కోప్‌ నీటి ఆనవాళ్లను గుర్తించింది. చంద్రుడిపై ఇంకా ఎక్కడెక్కడ నీటి జాడ ఉందో కనిపెట్టేందుకు ముమ్మరంగా ప్రయత్నాలు జరుగుతున్నాయి.

చంద్రుడిని మానవ నివాస యోగ్యంగా మార్చాలని ఎన్నో దశాబ్దాల నుంచి ప్రయత్నాలు జరుగుతున్నాయి. జన జీవనానికి అవసరమైన గాలి, నీటి జాడ కోసం జాబిల్లిపై శాస్త్రవేత్తలు నిరంతర ప్రయోగాలు చేస్తూనే ఉన్నారు. వాళ్లు ఊహించిన దాని కంటే ఎన్నో రెట్లు ఎక్కువగా చంద్రుడిపై నీటి ఆనవాళ్లు ఉన్నట్లు తాజాగా బయటపడింది. చంద్రుడిపై సూర్యకాంతి పడే ప్రాంతంలో నీటి ఆనవాళ్లు గుర్తించినట్లు... ఎప్పటికీ సూర్యకాంతి పడని ప్రదేశంలో కోల్డ్‌ ట్రాప్స్‌ మంచుతో నిండి ఉన్నట్లు తాజా అధ్యయనాల్లో తేలింది.

గతంలో చంద్రుడి ఉపరితలాన్ని స్కాన్‌ చేసి నీటి ఆనవాళ్లు గుర్తించినా.. నీళ్లు, హైడ్రాక్సిల్‌ మధ్య తేడాను గుర్తించలేకపోయారు. సోఫియా టెలిస్కోప్‌ ద్వారా మరింత కచ్చితంగా చంద్రుడి ఉపరితలాన్ని స్కాన్‌ చేసిన శాస్త్రవేత్తలు... కొత్త అధ్యయనాల్లో సూర్యరశ్మి ప్రాంతాల్లో నీరు పరమాణు రూపంలో ఉందని తేల్చారు. చంద్రుడిపైకి నీరు ఎలా వచ్చింది? ఎలా నిల్వ అయింది? అనేది తెలుసుకోవడానికి ప్రయత్నిస్తున్నారు.

చంద్రుడి ఉపరితలానికి సంబంధించిన జిఫ్‌ను సోషల్ మీడియాలో షేర్ చేసింది... నాసా. సోఫియా టెలిస్కోప్‌ సాయంతో చంద్రుడిపై సూర్యరశ్మి పడే ప్రాంతంలో నీరు ఉందని మొదటిసారి కనుగొన్నామని...పెన్సిల్ కొన కంటే చిన్నదిగా ఉండే గాజు పూసలాంటి నిర్మాణాల్లో నీటిని నిల్వ చేయొచ్చని శాస్త్రవేతలు భావిస్తున్నారని సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది.

మొత్తానికి చంద్రుడిపై కొత్త విషయాన్ని కనుక్కుంది నాసా. అక్కడ నీటికి సంబంధించిన వివరాలను గుర్తించి.. ఆ సమాచారాన్ని ప్రపంచానికి చాటింది నాసా. అప్పట్లో చంద్రుడిపై నిశితంగా పరిశీలించి నీటి జాడలను గుర్తించినా ఆ విషయంలో క్లారిటీ లేదు. అది నీళ్లా లేదా హైడ్రాక్సిలా అనేది స్పష్టంగా తెలుసుకోలేకపోయారు.ఇపుడు మాత్రం నీటి జాడను ఐడెంటిఫై చేశారు.





మరింత సమాచారం తెలుసుకోండి: