చాల మంది జంతువులను పెంచుకోవడనికి మక్కువ చూపిస్తుంటారు. కొంత మంది జీవనోపాధి కోసం పశువులు, గొర్రెలు, మేకలు, కోళ్ల పెంచుకుంటారు. ఆసక్తి, ఆకర్షణతో మరి కొందరు కొన్ని రకాల జంతువులు, పక్షులను పెంచుతుంటారు. వృత్తిగా చేపట్టినవారు గుడ్లు, మాంసం తదితరాలతో ఆదాయం. ఇష్టంగా పెంచుకునేవారు ఆనందం, వినోదం పొందుతారు. కానీ, జంతు, పక్షుల పెంపకంతో కొన్ని అనారోగ్య సమస్యలు, ప్రమాదకర వ్యాధులు సంక్రమిస్తాయన్న విషయం మరిచిపోతున్నారు. అప్రమత్తంగా ఉంటేనే జూనోసిస్‌ వ్యాధుల నుంచి బయటపడొచ్చని నిపుణులు సూచిస్తున్నారు.

పెంపుడు జంతువులను పెంచుకునే వారు అప్రమత్తంగా లేకుంటే పలు వ్యాధులు సంక్రమించే అవకాశముంది. పెంపుడు జంతువులతో సన్నిహితంగా ఉండే వారు జాగ్రత్తలు పాటించాలని పశు వైద్యాధికారులు సూచిస్తున్నారు. ముఖ్యంగా వ్యాధి నిర్ధారణ కేంద్రాలు, పశు వైద్య సిబ్బంది, తోళ్ల పరిశ్రమలు, ధాన్యం గిడ్డంగుల్లో పనిచేసేవారు జూనోటిక్‌ వ్యాధులపై జాగ్రత్తగా ఉండాలని హెచ్చరిస్తున్నారు. అంతేకాదు జంతువులు, పక్షులకు సంబంధించిన బ్యాక్టీరియా, వైరస్‌ ప్రోటోజోవా, ఫంగస్‌, క్లామిడే లాంటి వాటితో జూనోసిస్‌ వ్యాధులు సంక్రమిస్తాయి.

అయితే జూనోసిస్‌ వ్యాధులు సోకినపుడు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలో చూద్దమా. వ్యాధి సోకిన జంతువులు, కోళ్ల మాంసం తినవద్దు. పూర్తిగా ఉడికిన మాంసాన్నే తినాలి. కుళ్లిపోయిన మాంసం, గుడ్లు, పాలు తీసుకోవద్దు. పాడి పశువులు, జంతువులను నిత్యం శుభ్రంగా ఉంచాలి. పశువులు, జంతువులు, పక్షులు, కోళ్లకు కాలానుగుణంగా వ్యాధి నిరోధక టీకాలు వేయించాలి. పశువులు, జంతువుల, పక్షుల కొనుగోలు, అమ్మకాల కేంద్రాల్లో డాక్టర్‌ ధ్రువీకరణ పత్రం తీసుకునే విధానాన్ని సక్రమంగా అమలు చేయాలి. పశువుల పాక వద్ద శుభ్రత, జంతువుల ఆరోగ్యంపై ప్రత్యేక శ్రద్ధ పెట్టాలి. రేబిస్‌, ఆంత్రాక్స్‌, గ్లాండర్స్‌ వంటి వ్యాధులపై అవగాహన కల్పించాలి. పెంపుడు కుక్కలకు యాంటీరేబిస్‌ టీకాలు వేయించాలి.

పశువులు, జంతువులకు విధిగా నట్టల నివారణ మందులు వేయించాలి. పందులు గ్రామ శివారుల్లోనే ఉండేలా ఏర్పాట్లు చేయాలి. పౌల్ట్రీ ఫారాలు, జంతు ప్రదర్శనశాల, డెయిరీలలో పనిచేసేవారు. పశు పోషకాలు, జంతు ప్రేమికులు వ్యక్తిగత పరిశుభ్రతపై శ్రద్ధ చూపాలి. మాస్కులు ధరించడం మంచిది. పశు సంవర్ధక, ఆరోగ్య శాఖ, పంచాయతీ, మున్సిపల్‌ అధికారులు రేబిస్‌ నివారణకు సంయుక్త కార్యాచరణ ప్రణాళిక అమలు చేయాలి. జూనోటిక్‌ వ్యాధుల నివారణకు స్వచ్ఛంద సంస్థలు క్రియాశీలక పాత్ర పోషించాలి. 

మరింత సమాచారం తెలుసుకోండి: