రాష్ట్రవ్యాప్తంగా పేదలంతా ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్న వార్త ఇది. గత టీడీపీ ప్రభుత్వ హయాంలో పేదలకోసం నిర్మించిన ఎన్టీఆర్ స్వగృహ అపార్ట్ మెంట్లు.. త్వరలో లబ్ధిదారులకు అందుబాటులోకి రాబోతున్నాయి. గతంలోనే వీటిని లబ్ధిదారులకు కేటాయించినా, అవి వారికి అందివ్వడంలో బాగా ఆలస్యం అయింది. ఈలోగా రాష్ట్రంలో ప్రభుత్వం మారడంతో ఎన్టీఆర్ స్వగృహ కార్యక్రమంలో కట్టిన ఇళ్లను లబ్ధిదారులకు కేటాయించలేదు.

ఈలోగా కరోనా బాధితులకోసం క్వారంటైన్ సెంటర్లుగా అపార్ట్ మెంట్లను ప్రభుత్వం వాడుకుంది. ఇటీవలే వామపక్షాలు లబ్ధిదారులని కలుపుకొని నిరసన కార్యక్రమాలు చేపట్టాయి. త్వరలో ఉద్యమం మొదలు పెడతామని కూడా హెచ్చరించాయి. తాజాగా చంద్రబాబు, వైసీపీ ప్రభుత్వానికి డెడ్ లైన్ పెట్టారు. సంక్రాంతి నాటికి పేదలకు ఇళ్లు కేటాయించకపోతే.. తామే వారిని తీసుకెళ్లి గృహప్రవేశాలు చేయిస్తామని హెచ్చరించారు బాబు. ఈ నేపథ్యంలో ఎన్టీఆర్ స్వగృహ అపార్ట్ మెంట్ల వ్యవహారం మరోసారి చర్చకు వచ్చింది.

గతంలోనే వైసీపీ ప్రభుత్వం పేదల అపార్ట్ మెంట్లపై స్పష్టమైన అభిప్రాయం చెప్పింది. పేదలకు ఇచ్చే ఇళ్లకు ఎలాంటి రుణాలు లేకుండా అన్నీ మాఫీ చేస్తామని చెబుతున్నార మంత్రులు, ఎమ్మెల్యేలు. గత ప్రభుత్వం బ్యాంకు రుణాలంటూ పేదలపైనే భారం మోపిందని, నాశిరకం అపార్ట్ మెంట్లు నిర్మించి పేదల జేబులు కొట్టిందని వైసీపీ నేతలు ఆరోపిస్తున్నారు. బ్యాంకు రుణాలు కూడా మాఫీ చేసి పేదలందరికి అపార్ట్ మెంట్లు అందుబాటులోకి తెస్తామని అన్నారు. అయితే ఆ లోగా నిరుపేదలకు ఇళ్ల పట్టాల పంపిణీ కార్యక్రమం పూర్తి చేస్తామన్నారు సీఎం జగన్. అయితే టీడీపీ వేసిన కోర్టు కేసులని కారణంగా చూపెడుతూ ఇళ్ల పట్టాల పంపిణీని వైసీపీ  ప్రభుత్వం వాయిదా వేస్తూ వస్తోంది. ఈ నేపథ్యంలో కనీసం ఎన్టీఆర్ గృహకల్ప పథకంలో నిర్మించిన అపార్ట్ మెంట్లపై అయినా నిర్ణయం తీసుకోవాలని ప్రభుత్వంపై ఒత్తిడి వస్తోంది. దీంతో జగన్ సర్కారు అపార్ట్ మెంట్ల కేటాయింపుపై త్వరలో తన నిర్ణయాన్ని ప్రకటించే అవకాశమున్నట్టు తెలుస్తోంది. పూర్తిగా రుణమాఫీ చేసి అపార్ట్ మెంట్లను లబ్ధిదారులకు అందించేందుకు జగన్ ప్రభుత్వం కసరత్తులు చేస్తున్నట్టు సమాచారం. 

మరింత సమాచారం తెలుసుకోండి: