రైలులో ప్రయాణిస్తున్న కిడ్నాపర్ ఎక్కడ దిగిపోతాడోనని ఓ రైలు ఏకంగా 240 కిలోమీటర్లు ఆగకుండా ప్రయాణించింది. రైల్వే పోలీసులు మూడేళ్ల చిన్నారి, కిడ్నాపర్ ను అదుపులోకి తీసుకుని తల్లీకూతురిని కలిపారు. ఈ ఘటన ఉత్తరప్రదేశ్ లోని లలిత్ పూర్ రైల్వే స్టేషన్ లో సోమవారం చోటు చేసుకుంది.

ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. లలిత్ పూర్ కు చెందిన దంపతులకు మూడేళ్ల కూమార్తె ఉంది. వీరిద్దరి మధ్య మనస్పర్ధలు రావడంతో తరచూ గొడవ పడుతుండేవారు. ఈ క్రమంలో సోమవారం కూడా భార్యభర్తలు గొడవపడ్డారు. గొడవ అనంతరం భర్త మూడేళ్ల చిన్నారిని తీసుకుని బయటకు వెళ్లిపోయాడు. ఎంత సేపైనా భర్త ఇంటికి రాలేదు. దీంతో తల్లి పోలీసులకు ఫిర్యాదు చేసింది.

బిడ్డను ఎత్తుకుని ఓ వ్యక్తి రాప్తిసాగర్ సూపర్ ఫాస్ట్ ఎక్స్ ప్రెస్ రైలు ఎక్కినట్లు తల్లికి సమాచారం రావడంతో బాధితురాలు పోలీసులను సంప్రదించింది. సీసీటీవీ ఫుటేజీలు పరిశీలించగా.. రాప్తిసాగర్ ఎక్స్ ప్రెస్ లో బిడ్డను ఎత్తుకుని ఓ వ్యక్తి ఎక్కిన దృశ్యాలు కనిపించాయి. దీంతో అప్రమత్తమైన ఆర్పీఎఫ్ పోలీసులు భోపాల్ రైల్వే పోలీసులకు సమాచారం అందించారు.

రైలును మధ్యలో ఆపితే కిడ్నాపర్ ఎక్కడ దిగిపోతాడోనని భావించిన పోలీసులు రైలును ఆపకుండా నడిపారు. లలిత్ పూర్ నుంచి భోపాల్ వరకు సుమారు 240 కిలోమీటర్ల దూరం వరకు ఆ రైలు ప్రయాణించింది. భోపాల్ రైల్వే స్టేషన్ కు చేరుకున్న రైలు చుట్టుముట్టు పోలీసులు నిలబడ్డారు. కిడ్నాపర్ పారిపోకుండా అన్ని డబ్బాలను క్షుణ్ణంగా పరిశీలించారు. కిడ్నాపర్ ని అదుపులో తీసుకున్న పోలీసులు ఒక్కసారిగా ఖంగు తిన్నారు. చిన్నారిని కిడ్నాప్ చేసింది తండ్రేనని ఆశ్చర్యానికి లోనయ్యారు. తండ్రీకూతురిని లలిత్ పూర్ కి తీసుకొచ్చి భార్యాభర్తలకు కౌన్సిలింగ్ ఇప్పించారు. ఇంకెప్పుడు గొడవ పడకుండా పాప భవిష్యత్ కోసం శ్రమించాలని సర్దిచెప్పి పంపించారు. మూడేళ్ల కూతురిని తల్లి దగ్గరికి చేర్చేందుకు రైల్వే పోలీసులు తీసుకున్న చర్యపై పలువురు అభినందించారు.

మరింత సమాచారం తెలుసుకోండి: