భారతీయ జనతా పార్టీ. రాజకీయాంగా ఎత్తులు పై ఎత్తులు వేయడంతో కాంగ్రెస్ ని ఎపుడో మించిపోయింది. నిజానికి అందరూ జిత్తుల మారి రాజకీయాలు అంటూ కాంగ్రెస్ ని తిడతారు కానీ ఆ పార్టీకి మించిన వ్యూహాలు ఎన్నో బీజేపీకి ఉన్నాయి. అవన్నీ కూడా గడచిన ఆరేళ్ల కాలంలో ఏపీలో చూపించిన బీజేపీ ఇపుడు సరికొత్త ఎత్తులు వేస్తోంది. ప్రత్యేక హోదాను చాలా సులువుగా పక్కన పెట్టిన బీజేపీ ఏపీకి ప్యాకేజి రూపంలో ఏమిచ్చిందో ఇప్పటికైనా చెప్పగలదా.

ఇక విభజన హామీలను ఒక్కటి అయినా గట్టిగా, పూర్తిగా తీర్చామని కూడా ఆ పార్టీ చెప్పుకోగలదా. కోరుకోని విభజనను ఏపీ ప్రజలకు కానుకగా ఇచ్చాక ఆ బాధ నుంచి ఉపశమనం కోసం ప్రత్యేక హోదా, పోలవరం జాతీయ ప్రాజెక్టు, హైదరాబాద్ తో ధీటు అయిన రాజధానిని ఇస్తామని అనాడు ఢిల్లీ సభలో బీజేపీ  చెప్పారు. ఇపుడు చూస్తే ఈ మూడు జరిగాయా అని ప్రజలు కేంద్ర పెద్దలను ప్రశ్నిస్తున్నారు. ఏపీని రాజకీయ ప్రయోగశాలగా మార్చి బీజేపీ ఆడుకుంటోందన్న విమర్శలు కూడా ఉన్నాయి.

ఏపీలో తీసుకుంటే ప్రత్యేక హోదా కధ విజయవంతంగా బీజేపీ ముగించేశాక కనీసం పోలవరాన్ని చూసుకుని అయినా తృప్తి పడదామని ప్రజలు భావించారు. కానీ ఇపుడు బీజేపీ ఆ కాడి కూడా వదిలేసింది. సగం సగం హామీ అన్నట్లుగా పోలవరాన్ని చేసి పారేసింది.  ఒక ప్రాజెక్ట్ నిర్మాణం అంటే అందులో పునరావాసం ఖర్చులు కూడా ఉంటాయని జాతీయ పార్టీగా బీజేపీకి తెలియకపోవడం బాధాకరమే. పైగా ఏ ఏటి కా ఏడు నిర్మాణ ఖర్చులు పెరుగుతాయి. దానికి తగినట్లుగా అంచనా వ్యయం మారుతుంది అన్నది కూడా తెలియకపోవడం కూడా ఇంకా చింతించాల్సిన విషయమే.

సరే ఇవన్నీ పక్కన పెడితే తనకు నోటా కంటే తక్కువ ఓట్లు ఇచ్చిన ఏపీ ప్రజలకు ఎందుకు నిధులు ఇవ్వాలని బీజేపీ పెద్దలు ఆలోచిస్తున్నట్లుగా ఉంది. కానీ అయిదు కోట్ల ఆంధ్రులు కూడా ఈ దేశంలో పౌరులు అని ఎందుకు ఆలోచించలేకపోతోందో అర్ధం కావడంలేదు అంటున్నారు. ఇక రాజకీయంగా ఏపీలో ఓట్లూ సీట్లు రావని ఆలోచనతోనే బీజేపీ ఇలా చేసిందని కూడా అంటున్నారు. అయితే వైసీపీ లేకపోతే టీడీపీ తమ వైపు ఉంటారన్న  కారణంతోనే బీజేపీ ఇలా చేస్తోంది అన్న మాట కూడా రాజకీయ నిపుణులు చెబుతున్నారు. ఏపీలోని పార్టీలంతా కలసి పోలవరం కోసం గట్టిగా నిలబడి సాధించుకోకపోతే మాత్రం ఏపీ మరింత దారుణమైన పరిస్థితుల్లోకి వెళ్ళిపోతుంది అని మేధావులు అంటున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: