కూరగాయల ధరలు మండిపోతున్నాయి. ఏది కొందామన్నా జేబులు తడుముకోవాల్సిన పరిస్థితి దాపురించింది. రోజురోజుకూ పెరిగిపోతున్న కూరగాయల ధరలను చూసి సామాన్యుడు మార్కెట్ వైపు అడుగుపెట్టాలంటేనే జంకుతున్నారు.  వారం క్రితం వరకు కిలో 25 కూడా పలకని బంగాళదుంప.. ఇప్పుడు రైతు బజార్‌లోనే కిలో 50 రూపాయలకు చేరింది. సాధారణ మార్కెట్లో 80 రూపాయలకు పైమాటే.

హైదరాబాద్‌ మార్కెట్‌కు రాజస్థాన్‌, ఉత్తరప్రదేశ్‌, ఆగ్రా నుంచి ఆలుగడ్డ ఎక్కువగా వస్తుంది. ఒక్క గుడిమల్కాపూర్‌ మార్కెట్‌కే నిత్యం 100 టన్నుల ఆలుగడ్డ వస్తుంటుంది. కానీ.. ఇప్పుడు సరఫరా భారీగా తగ్గింది. రోజుకు 20 లారీల్లో వచ్చే లోడ్‌.. ఇప్పుడు రెండు మూడు లారీలకు పడిపోయింది అంటున్నారు వ్యాపారులు. రోజుకు 20, 30 టన్నులు కూడా రావడం లేదంటున్నారు.

ఆలుగడ్డను ఉత్తరాదిలోనే దాచేస్తుండటంతో.. కొరత ఏర్పడింది అంటున్నారు వ్యాపారులు. అక్కడి వ్యాపారులు ఆలుగడ్డను అక్రమంగా కోల్డ్‌స్టోరేజీలకు చేరవేస్తుండటమే కాకుండా.. ధర పెరిగిన తర్వాత మార్కెట్‌కు రిలీజ్‌ చేద్దామన్న ఆలోచనలో ఉన్నారంటున్నారు. దీంతో హైదరాబాద్‌ మార్కెట్‌లో కొరత ఏర్పడి ధరలు భారీగా పెరుగుతున్నాయి.

రైతుల వద్ద ఉన్న సరుకును పూర్తిగా కొనుగోలు చేసిన తర్వాత ధరలు పెంచి అమ్ముతున్నారు దళారులు. తెలంగాణలో ఆలుగడ్డ ఉత్పత్తి తక్కువగా ఉండడంతో ఇతర రాష్ట్రాలపైనే ఆధారపడాల్సి వస్తోంది. ప్రస్తుతం ఆయా రాష్ట్రాల్లో ధరలు బాగా పడిపోవడంతో నగరానికి తరలించకుండా కొందరు వ్యాపారులు గోదాముల్లో భద్రపరుస్తున్నారు. ధరలు పుంజుకున్నాక వాటిని మళ్లీ మార్కెట్‌లకు తరలించి లాభాలు దండుకునేందుకు అక్కడి వ్యాపారులు ప్రయత్నిస్తున్నారు.

ఉత్తరాది దళారుల ప్రభావం ఇప్పుడు మార్కెట్‌లపై పడింది. రోజురోజుకు పెరుగుతున్న ధరలు సామాన్యుడి జోబుకు చిల్లుపెడుతున్నాయి. ఇప్పటికే ఏ కూరగాయ కొనాలన్నా కిలోకు 100 రూపాయలు పెట్టాల్సిన పరిస్థితి. ఆకుకూరల ధరలు సైతం భగ్గుమంటున్నాయి. ఉల్లి.. కోయకుండానే కంటతడి పెట్టిస్తోంది. దీంతో ఏం కొనేటట్టు లేదు.. ఏం తినేటట్టు లేదు అన్నట్టు తయారైంది సామాన్యుడి పరిస్థితి.  


మరింత సమాచారం తెలుసుకోండి: