విజయనగరం పైడితల్లి అమ్మవారి పండుగ సంధర్భంగా ప్రతీ యేటా ఘనంగా నిర్వహించే సిరిమానోత్సవానికి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న భక్తుల్లో విశేషమైన క్రేజ్, నమ్మకం ఉంది. చాలా దూర ప్రాంతాల నుండి ప్రజలు ఈ ఉత్సవాలను చూడటానికి విజయనగరం వస్తుంటారు. అలాంటి పర్వదినాన సిరిమాను సాక్షిగా తమకు అవమానం జరిగిందంటున్నారు ఆనందగజపతి రాజు కుమార్తె ఊర్మిళ. విజయనగరం పైడితల్లి సిరిమానోత్సవం రోజు కోట బురుజుపై కూర్చునే విషయంలో వివాదం రేగింది. వివరాల్లోకి వెళితే విజయనగరం మహారాజా కోట బురుజులపై నుంచి సిరిమానోత్సవాన్ని సందర్శించే సంప్రదాయం కొన్ని దశాబ్దాల నుంచి సాగుతూ వస్తోందని అలాగే ఈ ఉత్సవం రోజు  ముందుగా వచ్చిన తాము (ఆనంద గజపతిరాజు భార్య సుధ, కుమార్తె ఊర్మిళ) కోటపై కూర్చున్నామని ఆ తర్వాత అక్కడకు సంచయిత విచ్చేసి మమ్మల్ని కోట నుంచి బయటకు పంపమని పోలీస్, దేవాదాయ శాఖ అధికారులను పురమాయించడం విచారకరం అన్నారు. కోటపై ముందు వరస నుంచి వెళ్లిపోవాలని సంచయిత ఆదేశించారని.. తాము చెప్పలేమని పోలీసులు అనడంతో సంచయిత కోటకు మరోవైపు కుర్చీ వేసుకుని కూర్చొని ఉత్సవాన్ని తిలకించారు. దీన్ని అవమానంగా భావించిన సుధ, ఊర్మిళ ఇద్దరూ కిందికి దిగి వారి బంగ్లాలోకి వెళ్లిపోయారు. సంచయిత తీరుకు నిరసనగా బుధవారం ఆనందగజపతి రాజు రెండవ భార్య సుధ, ఊర్మిళ మౌనం పాటించారు. ఆనందగజపతిరాజు విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. మాన్సాస్ తన సొంత సంస్థ అయినట్లు అంతా తన ఇష్టం అన్నట్లుగా సంచయిత వ్యవహరిస్తున్నారని మండిపడ్డారు. సంచయిత చేష్టలు ఆనందగజపతికి అవమానకరమని వ్యాఖ్యానించారు. కోట బురుజులపై నుంచి సరిమానోత్సవం తిలకించడం తమ వారసత్వ హక్కు అన్నారు.

అశోక్ గజపతిరాజును కలిసి సహకరించాలని కోరినా స్పందించలేదన్నారు ఊర్మిళ. ట్రస్ట్ బోర్డు మెంబర్‌గా కూడా ప్రమాణ స్వీకారం జరగనివ్వడం లేదని.. తమకు జరుగుతున్న అన్యాయంపై మాత్రమే ప్రశ్నిస్తున్నామని.. ఎలాంటి రాజకీయాలు లేవు అన్నారు. మాన్సాస్‌పై చట్ట ప్రకారమే ముందుకు వెళ్తామని.. న్యాయస్థానాలపై తమకు గౌరవం ఉందన్నారు. మాన్సాస్‌లో జరుగుతున్న పరిణామాలపై న్యాయ పోరాటం చేస్తామన్నారు.  ఈవిధంగా ఊర్మిళ, సంచయితల మధ్య మరింతగా వివాదం ముదురుతోంది. ఇక అంతకు ముందే విజయనగరం ఎంఆర్ కాలేజీని ప్రైవేట్ పరం చేయాలని తీసుకున్న నిర్ణయంపై కూడా ఊర్మిళ గజపతి మండిపడిన సంగతి తెలిసిందే.

మరింత సమాచారం తెలుసుకోండి: