భారత సైన్యం సత్తా ఏంటో రాహుల్ తెలుసుకోవాలి: జేపీ నడ్డా

భారత సైన్యం సత్తా ఏంటో రాహుల్ ఇప్పటికైనా తెలుసుకోవాలని భాజపా జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా అన్నారు. యుద్ధ విమాన వింగ్ కమాండర్ అభినందన్ విడుదలపై పాకిస్థాన్ ఎంపీ ఆసక్తికర వ్యాఖ్యలు చేసిన విషయం తెలిసిందే. దీనిపై భాజపా అధ్యక్షుడు స్పందించారు. భారత సైన్యం బలం ఏంటో పాకిస్థాన్ కు కూడా తెలిసిందన్నారు. కానీ కాంగ్రెస్ నాయకులకు ఇంకా అర్థం కావట్లేదని అన్నారు. పాక్ ఎంపీ నవాజ్ సిద్దిఖ్ ఆ దేశ పార్లమెంట్ లో చేసిన వ్యాఖ్యలకు సంబంధించిన వీడియోని ట్వీటర్ లో పోస్ట్ చేశారు.

అభినందన్ ని విడుదల చేయాలని పాక్ విదేశాంగ మంత్రి ఖురేషీ ఆర్మీ చీఫ్ ని ఆదేశించిన విషయాన్ని ఆయన ప్రస్తావించడం ఆ వీడియో లో ఉంది. అతణ్ని వదిలిపెట్టకుంటే  ఆ రోజు 9 గంటలకు భారత్ దాడి చేస్తుందనే భయం పాకిస్థాన్ ప్రముఖులలో ఉందని నవాజ్ ఆ వీడియోలో పేర్కొన్నారు.  ఆ సమయంలో పాక్ ఆర్మీ చీఫ్ కాళ్ళు వణికాయని, అతనికి చెమటలు పట్టాయని పాక్ ఎంపీ గుర్తుచేశారు.

నడ్డా మాట్లాడుతూ...రాహుల్ గాంధీకి మన దేశం, మన ప్రజలు, మన ప్రభుత్వం అనేది ఏదీ లేదని , తనకు అత్యంత నమ్మకమైన దేశం పాకిస్థాన్ స్వయంగా చెప్తుంటే ఇప్పటికైనా ఆయన కళ్ళుతెరవాలన్నారు.

కాంగ్రెస్ మొత్తం భారత్ సైన్యాన్ని నష్టపరిచేలా ప్రవర్తించిందని విమర్శించారు. బలగాల సామర్థ్యాన్ని ప్రశ్నించారని, రఫెల్ యుద్ధ విమానాలు రాకుండా చివరివరకు అడ్డుపడ్డారని దుయ్యబట్టారు. ఇలాంటి రాజకీయాలు చేస్తే దేశ ప్రజలు ఒప్పుకోరని, కచ్చితంగా ఆ పార్టీకి బుద్ధి చెప్తారని హితవు పలికారు.


గత ఏడాది ఫిబ్రవరిలో భారత వాయు సరిహద్దు దాటి వచ్చిన పాకిస్థాన్ యుద్ధ విమానాల్ని భారత పైలెట్లు తరిమికొట్టారు. ఈ క్రమంలో భారత వింగ్ కమాండర్ అభినందన్ విమానం పాక్ భూభాగంలో కూలిపోయింది. దీంతో ఆ దేశ సైన్యం అతణ్ని అదుపులోకి తీసుకొంది. అనంతరం మార్చి 1 న విడుదల చేసింది.

మరింత సమాచారం తెలుసుకోండి: