ప్రపంచవ్యాప్తంగా కరోనా మళ్లీ కోరలు చాస్తోంది. ఇదివరకు వ్యాప్తి తగ్గిన దేశాల్లో కూడా మళ్లీ కేసులు పెరుగుతున్నాయి. గడిచిన 24 గంటల్లో ప్రపంచవ్యాప్తంగా రికార్డు స్థాయిలో 5,16,898 పాజిటివ్‌ కేసులు నమోదయ్యాయి. 7,723 మంది వైరస్ తో చనిపోయారు.

కరోనా కేసులు కాస్త తగ్గాయని అనుకునేలోపే.. మళ్లీ వైరస్‌ విజృంభిస్తోంది.  ప్రపంచవ్యాప్తంగా కొత్తగా రికార్డు స్థాయిలో 5,16,898 పాజిటివ్‌ కేసులు నమోదయ్యాయి. 7,723 మంది వైర్‌సతో చనిపోయారు. కరోనా వైరస్‌ వ్యాప్తి మొదలైన తర్వాత ఒక రోజులో ఇన్ని కేసులు నమోదవడం ఇదే తొలిసారి. తాజాగా వెలుగుచూసిన ఐదు లక్షల కేసుల్లో అమెరికా, భారత్‌, బ్రెజిల్‌, ఫ్రాన్స్‌, స్పెయిన్‌,  బ్రిటన్‌లోనే ఎక్కువ కేసులు ఉన్నాయి. గడిచిన వారం రోజుల్లో ప్రపంచవ్యాప్తంగా సుమారు 20 లక్షలకుపైగా పాజిటివ్‌ కేసులు నమోదైనట్టు ప్రపంచ ఆరోగ్య సంస్థ వెల్లడించింది.

కరోనా వైరస్‌ వ్యాప్తి ఎక్కువ కావడంతో జర్మనీ, ఫ్రాన్స్‌ మళ్లీ లాక్‌డౌన్‌ విధించే దిశగా అడుగులు వేస్తున్నాయి. గత 24 గంటల్లో ఫ్రాన్స్‌లో 38 వేల కేసులు బయటపడ్డాయి.  జర్మనీలో 14 రోజుల వ్యవధిలో లక్షకుపైగా కేసులు బయటపడ్డాయి. దీంతో జర్మనీ చాన్స్‌లర్‌ ఏంజెలా మెర్కెల్‌.. 16 రాష్ట్రాల్లో తాత్కాలిక లాక్‌డౌన్‌ విధించాలని ఆయా గవర్నర్లను ఆదేశించారు.

రెండో దఫా కరోనా ఉద్ధృతితో యూరప్‌దేశాలు వణికిపోతున్నాయి. ఫ్రాన్స్‌లోనూ రోజువారీ మరణాల సంఖ్య ఒక్కసారిగా పెరిగింది. కరోనా రోగులతో ఆసుపత్రులన్నీ నిండిపోతున్నాయి. దేశవ్యాప్తంగా మరోసారి లాక్‌డౌన్‌ విధించాలని అక్కడి వైద్యులు ఫ్రాన్స్‌ ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తున్నారు. ఫ్రాన్స్‌లో ఇప్పటివరకు అక్కడ 12లక్షల మందిలో వైరస్‌ బయటపడగా వీరిలో 35వేల మంది ప్రాణాలు కోల్పోయారు.

మొత్తానికి కరోనా వైరస్ తన ప్రతాపం చూపిస్తోంది. ఇన్నాళ్లూ తగ్గినట్టే తగ్గి తన జూలు విదుల్చుతోంది. సెకండ్ వేవ్ మొదలైందనే ప్రచారం జోరుగా జరుగుతోంది. తగిన జాగ్రత్తలు తీసుకోకపోతే అపార నష్టం జరిగేలా కనిపిస్తోంది. వ్యాక్సిన్ వచ్చే వరకు మనం మాత్రం అప్రమత్తతతో ఉండాల్సిందే.







మరింత సమాచారం తెలుసుకోండి: