ఏపీలో మందుబాబులకు శుభ వార్త చెప్పింది రాష్ట్ర ప్రభుత్వం. మద్యం ధరలు తగ్గిస్తూ సవరించిన నోటిఫికేషన్ విడుదల చేసిన అబ్కారీ శాఖ ఏయే బ్రాండ్ లకు తగ్గిస్తున్నామో తన నోటిఫికేషన్ లో స్పష్టంగా వెల్లడించింది. ఐఎంఎఫ్ఎల్ లిక్కరుతో పాటు, విదేశీ మద్యంలోని మద్య, ఉన్నత శ్రేణి బ్రాండ్లకు సంబంధించిన ధరల తగ్గిస్తు నిర్ణయం తీసుకున్నారు. రూ. 50 నుంచి రూ. 1350 వరకూ వివిధ కేటగిరీల్లో మద్యం ధరల తగ్గిస్తూ ఆదేశాలు జారీ చేసారు. రేపట్నుంచే తగ్గించిన మద్యం ధరలు అమలు అవుతాయని ఏపీ సర్కార్ స్పష్టం చేసింది.

బీర్లు, రెడీ టూ డ్రింక్ మద్యం ధరల్లో ఎలాంటి మార్పూ లేదని స్పష్టం చేసింది ఏపీ సర్కార్. రూ. 200 రూపాయల్లోపు క్వార్టర్ బాటిల్ ధరలపై మార్పు లేదని ఏపీ సర్కార్ పేర్కొంది. రూ. 200 దాటిన క్వార్టర్ బాటిల్  ధరలను తగ్గిస్తూ ఆదేశాలు జారీ చేసింది. బ్రాండ్లు, బాటిళ్ల పరిమాణాలను అనుసరించి 90 ఎంఎల్ కు రూ. 50 రూపాయల నుంచి లీటరు మద్యం ధర రూ. 1350 వరకూ తగ్గిస్తూ ఆదేశాలు జారీ చేసింది. ఎస్ఈబీ నివేదిక ఆధారంగా మద్యం ధరల తగ్గిస్తూ నిర్ణయం తీసుకున్నారు. పొరుగు రాష్ట్రాల నుంచి అక్రమ మద్యం రవాణాను అరికట్టేందుకు ఈ ధరల్ని తగ్గిస్తున్నట్టు వెల్లడించిన ప్రభుత్వం...

చీప్ లిక్కరుతో పాటు ప్రీమియం బ్రాండ్ల మద్యం తెలంగాణా నుంచి పెద్ద ఎత్తున స్మగ్లింగ్ అవుతుండటంతో ఈ ధరల్ని తగ్గిస్తూ నిర్ణయం తీసుకున్నట్టు తెలిపింది. 2020 సెప్టెంబరు 15 నుంచి అక్టోబరు 15 మధ్య కాలంలో పొరుగు రాష్ట్రాల నుంచి మద్యం అక్రమ రవాణాకు సంబంధించి  1211 కేసులు నమోదు అయినట్టు  తెలిపింది. తెలంగాణా నుంచి 630, కర్ణాటక నుంచి 546, ఒడిశా నుంచి 24, తమిళనాడు నుంచి 11 కేసులు నమోదైనట్టు పేర్కొంది. తెలంగాణా, కర్ణాటకల్లో మద్యం ఎమ్మార్పీ ధరలు ఏపీ కంటే రెండింతలు తక్కువ కావటంతోనే స్మగ్లింగ్ జరుగుతున్నట్టు నివేదిక ఇచ్చారు. పొరుగు రాష్ట్రాల సరిహద్దులు పంచుకుంటున్న ఏపీ మండలాల్లో పెద్ద మొత్తంలో స్మగ్లింగ్ జరుగుతున్నట్టుగా ఎస్ఈబీ నివేదికలో పేర్కొంది.

మరింత సమాచారం తెలుసుకోండి: