పోలవరం ప్రాజెక్ట్ నిర్మాణం కేంద్రం బాధ్యత. విభజన చట్టంలో స్పష్టంగా ఉన్న ఈ హామీని నెరవేర్చడంలో మాత్రం కేంద్రం మీనమేషాలు లెక్కిస్తోంది. తమ హయాంలో ప్రాజెక్ట్ నిర్మాణం 70శాతం పూర్తయ్యిందని అంటోంది టీడీపీ. 30శాతం నిధులతో 70శాతం పనులు ఎలా పూర్తయ్యాయని ప్రశ్నిస్తోంది వైసీపీ. ఈ దశలో కేంద్రం పోలవరం నిర్మాణ వ్యయాన్ని సగానికి సగం తగ్గించిందనే వార్తలు కలకలం రేపాయి. అయితే ప్రాజెక్ట్ అంచనా వ్యయం విషయంలో కేంద్రంతో పోరాటానికి సిద్ధం అంటూ వైసీపీ నేతలు ప్రకటిస్తున్నారు. మరోవైపు మంత్రి బొత్స సత్యనారాయణ పోలవరంపై చేసిన ప్రకటన మరింత ఆసక్తిగా మారింది.
అవసరమైతే అనుకున్న టైమ్ కి పూర్తి చేసే విధంగా పోలవరం ప్రాజెక్టును కేంద్రానికి అప్పగిస్తామని అన్నారు మంత్రి బొత్స. చంద్రబాబు నాయుడులాగా దోపిడీ చేయడం, ధన దాహం కోసం రాష్ట్రానికి జీవనాడి అయిన ప్రాజెక్టును తాకట్టు పెట్టే ఆలోచనలు తాము చేయబోమని చెప్పారు. 2018లోగా పోలవరం పూర్తి చేస్తామని తొడలు కొట్టిన చంద్రబాబు తర్వాత ఏంచేశారని మండిపడ్డారు. కొబ్బ‌రికాయలు కొట్టి పబ్లిసిటీ చేసుకునే చంద్రబాబు వాటిలో ఏమేం పూర్తి చేశారని ప్రశ్నించారు. చంద్రబాబు మాటలు ఎప్పుడూ కోటలు దాటుతుంటాయని, ఆచరణలో గడప దాటవని అన్నారు. ప్రధాన ప్రతిపక్షం అంటే బాధ్యతగా పనిచేయాలని గుర్తు చేశారు.

తన కాసుల కక్కుర్తి కోసం, కాంట్రాక్టు కోసం, ప్రత్యేక హోదాను తాకట్టు పెట్టి, ప్యాకేజీకి ఒప్పుకుని మరీ పోలవరం ప్రాజెక్ట్ ని చంద్రబాబు పూర్తి చేయకుండా ఆపేశారని మండిపడ్డారు మంత్రి బొత్స సత్యనారాయణ. సెప్టెంబరు 8, 2016 నాడు కేంద్ర ప్రభుత్వంతో బాబు చీకటి బేరాలు చేసుకున్నాడని, ఫలితంగానే ఈరోజు మళ్ళీ కేంద్ర ప్రభుత్వంతో వైసీపీ ప్రభుత్వం నిజానిజాలేమిటో చెప్పాల్సిన పరిస్థితి, వారిని ఒప్పించాల్సిన పరిస్థితి వచ్చిందని అన్నారు. ఒకవేళ కేంద్రం ససేమిరా అంటే.. పోలవరం నిర్మాణం బాధ్యతను వారికే అప్పగించే ఆలోచన చేస్తామన్నారు. ఒకరకంగా నిర్మాణ వ్యయాన్ని తగ్గించాలని చూస్తున్న కేంద్రంకోర్టులోకే వైసీపీ బంతిని నెట్టేసినట్టయింది. 

మరింత సమాచారం తెలుసుకోండి: