మాజీ ఎంపీ ఉండవల్లి అరుణ్ కుమార్ 'పోలవరం ప్రాజెక్ట్' విషయంలో జగన్ సర్కార్‌ను ప్రశ్నించారు. పోలవరం ప్రాజెక్ట్‌ విషయంపై కేంద్రం ఎప్పటికప్పుడు మాట మారుస్తున్నప్పుడు రాష్ట్ర ప్రభుత్వం ఎందుకు కౌంటర్‌ దాఖలు చేయడం లేదని ప్రశ్నించారు. రాష్ట్రంలో జగన్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి ఏడాదిన్నర దాటింది..అయినా కూడా ఈ ప్రాజెక్టు విషయమై సీఎం జగన్ ఎందుకు నోరు మెదపడం లేదన్నారు. పార్లమెంట్‌లో చట్టం చేశాక కేబినెట్ మీటింగ్ లో అంచనా వ్యయం తగ్గించడానికి వీల్లేదు అన్నారు. జగన్ ప్రధాని మోదీ కాలర్ పట్టుకోనక్కర్లేదు కానీ.. కోర్టులో కేసు వేస్తే చాలు అని..  కానీ కేంద్రం చట్టం అమలు చేయట్లేదని ఎందుకు కేసు వేయరని ప్రశ్నించారు. జగన్‌ కేసుల గురించే ప్రధాని మోదీ దగ్గర పోలవరం విషయం ఎత్తడం లేదన్నారు. కేసుల నుంచి తప్పించుకునేందుకు రాష్ట్ర ప్రయోనాలను తాకట్టుపెడతారా..?. నిజం మాట్లాడుతున్నాడనుకుని జగన్‌కు రాష్ట్ర ప్రజలు భారీ విజయాన్ని అందించారన్నారు.

 కేసులు ఉండటం వల్లే మోదీని ప్రశ్నించేందుకు జగన్ భయపడుతున్నారన్న ప్రచారం జనంలో ఉందన్నారు. అన్నింటికీ చంద్రబాబును విమర్శిస్తున్నారని.. ప్రజలు 151 సీట్లు ఇచ్చింది చంద్రబాబును విమర్శించడానికి కాదన్నారు. 51 శాతం మంది ఓట్లు వేసి గెలిపించిన ప్రజలు జగన్ ధైర్యంగా మాట్లాడతారని భావించారన్నారు అరుణ్ కుమార్. జగన్‌కు ఉన్న ఆ ధైర్యం ఏమైందని ప్రశ్నించారు. పోరాటం చేసి గెలిచి ముఖ్యమంత్రి అయ్యారు.. ఇప్పుడు కూడా పోలవరంపై పోరాడు.. పోలవరం ప్రాజెక్టు విషయంలో రాజశేఖరరెడ్డి కొడుకు కాంప్రమైజ్ అయితే ఈ ప్రభుత్వం ఇక ఎందుకన్నారు. టీడీపీ హయాంలో జగన్ పాదయాత్ర చేసినప్పుడు అదే పనిగా విమర్శించారు. ఇప్పుడెందుకు నోరు మెదపట్లేదన్నారు. కేవీపీ కోర్టులో వేసిన పిటిషన్‌పై వైసీపీ ప్రభుత్వం అఫిడవిట్ దాఖలు చేయాలని.. చట్ట ప్రకారం కేంద్ర ప్రభుత్వమే పోలవరం ప్రాజెక్టు పూర్తి చేయాలన్నారు.

కేసుల నుంచి బయటపడేందుకు జగన్ మౌనంగా ఉంటే మాత్రం ప్రజలు క్షమించరు.. బలహీనతలను పక్కన పెట్టాలన్నారు ఉండవల్లి. కేసులు విషయంలో వెంటనే శిక్ష పడదని.. ఒకవేళ జైలుకి వెళ్లినా ఆయన చెప్పిన వ్యక్తి రాష్ట్రంలో ముఖ్యమంత్రి అవుతారన్నారు. పోలవరం ప్రాజెక్టు పరిస్థితి ఇలా అవుతుందని ఎప్పుడు అనుకోలేదని.. రిజర్వాయర్‌ కట్టేందుకు అవకాశం ఉన్న ప్రాంతం పోలవరం అని..  భూసేకరణ లేకుండా ప్రాజెక్ట్‌ నిర్మాణమే జరగదని.. పోలవరం నిర్మించాలని విభజన చట్టంలోనే ఉందన్న విషయాన్ని గుర్తు చేశారు. పోలవరం ఫైనాన్షియల్‌ ప్యాకేజీ గురించి పార్లమెంట్‌లో వెంకయ్యనాయుడు మాట్లాడారని ఉండవల్లి గుర్తు చేశారు. పోలవరం ప్రాజెక్ట్‌, భూసేకరణ వ్యయం భరిస్తామని ఆనాడు కేంద్ర మంత్రి షిండే కూడా హామీ ఇచ్చారని.. పోలవరం పూర్తి చేస్తామని బీజేపీ నేతలు కూడా హామీ ఇచ్చిన విషయాన్ని గమనించాలన్నారు. వైఎస్సార్‌సీపీ అధికారంలోకి వచ్చాక రాజ్యసభలో పోలవరం ప్రాజెక్ట్‌పై చర్చ జరిగిన సమయంలో.. రూ. 55 వేల 587 కోట్లకు ఆమోదించినట్లు నాటి కేంద్రమంత్రి కటారియా ప్రకటించారని.. ప్రధాని మోదీ ఒకలా చెబితే.. కేంద్రమంత్రి మరోలా చెప్పారన్నారు. ఎన్నికల ముందు రాజమండ్రి ప్రచారసభలో మోదీ చంద్రబాబుకు పోలవరం ఏటీఎంలా మారిందని చెప్పారని.. ఆ తర్వాత అప్పటి జలశక్తి మంత్రి కటారియా పార్లమెంటులో పోలవరం విషయంలో ఎలాంటి అవకతవకలు జరగలేదని ప్రకటించిన విషయాన్ని గుర్తు చేశారు.

మరింత సమాచారం తెలుసుకోండి: