ఆంధ్రప్రదేశ్ లో నవంబర్ 2 నుంచి స్కూళ్లు, కాలేజీలు  పునః ప్రారంభంకానున్నాయి.  క్లాసుల నిర్వహణకు సంబంధించిన షెడ్యూల్ ను విడుదల చేసింది విద్యాశాఖ. కోవిడ్ నిబంధనల మధ్య .. తరగతులు నిర్వహించేందుకు మార్గదర్శకాలు విడుదల  చేసింది.  

ఆంధ్రప్రదేశ్ లో ఎట్టకేలకు పాఠశాలలు, కళాశాలలు తిరిగి  ప్రారంభం కాబోతున్నాయి. తొలుత సెప్టెంబర్ అని.. తరువాత అక్టోబర్ నెలలో ప్రారంభిద్దామని అనుకున్నా.. కరోనా ఉధృతి కారణంగా సాధ్యం కాలేదు. ఇప్పుడు నవంబర్ 2 నుంచి ప్రారంభించడానికి అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయి. దీనికి సంబంధించిన షెడ్యూల్ ప్రభుత్వం  విడుదల చేసింది.

పాఠశాలలు, కాలేజీలు ఇకపై రోజు విడిచి రోజు నడపనున్నారు. అది కూడా ఒక పూట మాత్రమే. ప్రభుత్వం విడుదల చేసిన ఈ షెడ్యూల్ ప్రభుత్వ, ప్రైవేటు రెండింటికీ వర్తిస్తుంది. కరోనా వ్యాపించకుండా అన్నిరకాల జాగ్రత్తలు తీసుకుంటున్నట్టు  ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి నీలం సాహ్ని తెలిపారు.

నవంబర్‌ 2 నుంచి 9,10,11 తరగతులతో పాటు ఇంటర్మీడియట్‌ మొదటి, రెండవ సంవత్సరం తరగతుల్ని తరగతులు రోజు విడిచి రోజు..ఒక పూట నడపనున్నారు. రొటేషన్‌ పద్ధతిలో ఈ తరగతులు జరగనున్నాయి. నవంబర్‌ 23 నుంచి 6,7,8  క్లాసులు   ప్రారంభం కానున్నాయి. డిసెంబర్‌ 14 నుంచి 1, 2, 3, 4, 5 తరగతులను కూడా ప్రారంభిస్తారు. ఇంటర్మీడియట్, డిగ్రీ అడ్మిషన్లను ఇప్పటికే ప్రభుత్వం ఆన్ లైన్ ద్వారా ప్రారంభించింది.

కరోనా వైరస్ దెబ్బకు విద్యాసంస్థలు మూతబడ్డాయి. విద్యార్థులు ఇంటికే పరిమితమయ్యారు. ఇన్నాళ్లూ.. ఆటలు.. పాటలతో ఇల్లే లోకంగా గడిపారు. ఇపుడు ఇల్లు దాటే సమయం వచ్చేసింది. స్కూళ్లు నవంబర్ 2నుంచి ప్రారంభం కాబోతున్నాయి. ప్రభుత్వ, ప్రైవేట్ పాఠశాలల్లో కోవిడ్ నిబంధనలు పాటించేందుకు యాజమాన్యాలు సిద్ధమయ్యాయి. స్కూళ్లలో శానిటైజేషన్ చేయడంతో పాటు.. విద్యార్థులకు మాస్కులు తప్పనిసరి చేశారు. తగు జాగ్రత్తల మధ్య పాఠశాలలు ప్రారంభం కాబోతుండటంతో.. విద్యార్థులు స్కూళ్లకు పంపించేందుకు తల్లిదండ్రుల నుంచి ఎలాంటి స్పందన వస్తుందో చూడాలి.



   



మరింత సమాచారం తెలుసుకోండి: