లాక్ డౌన్ కాలంలోనూ, ఆ తర్వాత కూడా బంగారం రేటు విపరీతంగా పెరిగింది. షేర్ మార్కెట్ పై ఇన్వెస్టర్లు నమ్మకం కోల్పోవడంతో ఆ పెట్టుబడులన్నీ గోల్డ్ మార్కెట్ వైపు మళ్లాయి. బహిరంగ మార్కెట్ తోపాటు, గోల్డ్ ఈటీఎఫ్ బాండ్లలో కూడా భారీగా పెట్టుబడులు పెడుతున్నారు. ఇంటి అవసరాలకోసమే కాకుండా.. భవిష్యత్తులో రేటు మరింత పెరుగుతుందనే నమ్మకంతో చాలామంది బంగారం కొనిపెట్టుకుంటున్నారు. అయితే లాక్ డౌన్ కాలంలో, లాక్ డౌన్ తర్వాత కొన్న బంగారం అంతా తిరిగి బ్యాంకుల్లోకే వెళ్తుందని తెలుస్తోంది.

కరోనా ప్రభావంతో అన్ని వ్యాపారాలు దాదాపుగా దెబ్బతిన్నాయి. అయితే బంగారం తాకట్టు పెట్టుకునే సంస్థల వ్యాపారం మాత్రం రెట్టింపు స్థాయిలో జరుగుతోందట. ప్రైవేట్ సంస్థలతోపాటు, బ్యాంకుల్లో కూడా బంగారం తాకట్టు వ్యవహారం బాగా పెరిగిపోయినట్టు తెలుస్తోంది. లాక్ డౌన్ కాలంలో చాలామంది ఉద్యోగాలు కోల్పోయారు, చిరు వ్యాపారుల ఉపాధికి గండి పడింది. వారంతా ఇప్పుడు లాక్ డౌన్ తర్వాత కొత్తగా ఉపాధి మార్గాలు వెతుక్కుంటున్నారు. ఈ నేపథ్యంలో వారికి పెట్టుబడికోసం బంగారం ఆసరాగా మారింది. అందుకే చాలామంది ఇప్పుడు బంగారాన్ని తాకట్టు పెట్టి రుణాలు తీసుకోడానికి ఆసక్తి చూపిస్తున్నారని, గడచిన నెలరోజుల్లో వీరి శాతం 20కి పైగా పెరిగిందని అంటున్నారు.

ఆర్థిక అవసరాలకోసం గోల్డ్ లోన్ తీసుకునేవారి సంఖ్య భారత్ లో బాగా పెరిగిందని సర్వేలు చెబుతున్నాయి. బంగారం రేటు పెరగడం, గ్రాము రేటుకి ఇచ్చే లోన్ వేల్యూ కూడా పెరగడంతో చాలామంది గోల్డ్ లోన్ వైపు ఆసక్తి చూపిస్తున్నారు. వడ్డీరేటు కూడా దీనికి తక్కువగా ఉండటం మరో కారణం. అందుకే బ్యాంక్ లతోపాటు, ప్రైవేట్ సంస్థల్లో కూడా గోల్డ్ లోన్ తీసుకునేవావారి సంఖ్యపెరిగింది. దీంతో ఇళ్లలో ఉండాల్సిన బంగారం అంతా బ్యాంక్ లకు చేరుతోంది. లాక్ డౌన్ కాలంలో కొన్న బంగారం కూడా ఆర్థిక అవసరాలకోసం తాకట్టులోకి వెళ్తోంది. 

మరింత సమాచారం తెలుసుకోండి: