మొన్న హైదరాబాద్‌.. నిన్న బెంగళూరు.. ఇప్పుడు చెన్నై..! వరుణుడు మహానగరాలపై ప్రతాపం చూపుతున్నాడు. భారీ వర్షాలు చెన్నై నగరాన్ని అతలాకుతలం చేస్తున్నాయి‌. లోతట్టు ప్రాంతాలన్నీ జలమయం అయ్యాయి‌. చెన్నైకు భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని ఐఎండీ హెచ్చరించింది.

మొన్న హైదరాబాద్‌ని వణికించాయి‌. బెంగళూరును అతలాకుతలం చేశాయి‌. ఇప్పుడు చెన్నైలో బీభత్సం సృష్టిస్తున్నాయి‌ భారీ వర్షాలు. చెన్నై మహానగరంలో ఎడతెరిపిలేకుండా భారీగా వర్షాలు కురుస్తున్నాయి‌. తిరువాన్మియూర్, మైలాపూర్, రాయపెట్ట, అడయార్‌లలో కుండపోత వర్షం కురిసింది. కుండపోతగా కురుస్తున్న వర్షాలకు పలు కాలనీలు నీట మునిగాయి.

ఈశాన్య రుతుపవనాల ప్రభావంతో చెన్నైలో భారీ వర్షాలు కురుస్తున్నాయి. ఏకధాటి వర్షానికి చెన్నై జలమయమైంది. రోడ్లు చెరువుల్లా మారాయి. పలుచోట్ల ట్రాఫిక్ నిలిచిపోయింది. జన జీవనం అస్తవ్యస్తమైంది. రాత్రి నుంచి ఎడతెరిపిలేకుండా వర్షం కురవడం వల్ల.. బయటకు రావడానికి వీల్లేని పరిస్థితి ఏర్పడింది. దక్షిణ చెన్నైలో వర్షాల ప్రభావం ఎక్కువగా ఉంది. చాలా ప్రాంతాల్లో నీళ్లు ఎక్కడిక్కడ నిలిచిపోయాయి‌.

చెన్నైలో రాగల 24 గంటల్లో భారీ నుంచి అతిభారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరించింది. దీంతో అధికారులు అలర్ట్‌ అయ్యారు. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని ప్రకటించారు. అండమాన్‌కు సమీపంలో బంగాళాఖాతంలో ద్రోణి ఏర్పడడం, ఈశాన్య రుతుపవనాల రాకతో చెన్నైలో భారీ వర్షాలు కురుస్తున్నాయ్‌.  

వరణుడు మహానగరాలపై పగబట్టినట్టు కనిపిస్తున్నాడు. ఇన్నాళ్లూ హైదరాబాద్ నగరాన్ని అతలాకుతలం చేసిన ఈ వర్షాలు తాజాగా బెంగళూరు నగరాన్ని ముంచెత్తాయి. లోతట్టు ప్రాంతాలను జలమయం చేశాయి. ఎన్నో ఇళ్లను కూల్చివేశాయి. దీంతో చాలామంది నివాసాలను కోల్పోయి.. అభాగ్యుల్లా మారారు. ముఖ్యంగా పేద ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. ఇళ్లలోకి నీరు రావడంతో వారి అవస్థలు అన్నీ ఇన్నీ కావు. నిత్యావసరాలు తడిచిపోయి.. ఇక్కట్లు పడ్డారు.ఇప్పుడు చెన్నై నగరాన్ని వానలు ముంచెత్తుతున్నాయి. రోడ్లు జలమయమయ్యాయి. వరుణుడు మాత్రం మహానగరాలపై పగబట్టినట్టే కనిపిస్తున్నాడు.







మరింత సమాచారం తెలుసుకోండి: