ప్రభుత్వ, ప్రైవేట్ పాఠశాలల్ని తిరిగి ప్రారంభించే నిర్ణయాన్ని పూర్తిగా రాష్ట్రాలపై వదిలేసి కేంద్రం చేతులు దులుపుకుంది. ఈ నేపథ్యంలో కరోనా భయంతో ఇప్పటికే పలుమార్లు పాఠశాలల్ ప్రవేశాలకు మహూర్తం నిర్ణయించి మరీ రాష్ట్రాలు వెనకడుగు వేశాయి. జగనన్న విద్యా కానుక విషయంలో మాత్రమే ఏపీ ప్రభుత్వం కాస్త ధైర్యం చేసింది. ఇప్పుడిక అసలు విషయానికి వచ్చే సరికి చిన్నారుల ఆరోగ్యంపై మరింత ఆందోళన చెందుతోంది. అందుకే మరోసారి వెనకడుగు వేసింది.

రాష్ట్రంలో నవంబర్ 2 నుంచి పాఠశాలలు, కళాశాలలు తెరుచుకుంటున్నా.. 1 నుంచి 5వ తరగతి వరకు.. అంటే ప్రైమరీ ఎడ్యుకేషన్ మాత్రం డిసెంబర్ 14 నుంచి మాత్రమే మొదలవుతుంది. అప్పటికి రాష్ట్రంలో కొవిడ్ పరిస్థితి మరింత చక్కబడుతుందని రాష్ట్ర ప్రభుత్వం అంచనా వ్సోతంది. నవంబర్ 2నుంచి ప్రభుత్వ, ప్రైవేట్ పాఠశాలల్లో మూడు దశల్లో రోజు విడిచి రోజు తరగతులు నిర్వహిస్తారు. ఈ మేరకు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి నీలం సాహ్ని షెడ్యూల్‌ విడుదల చేశారు.

ప్రభుత్వ షెడ్యూల్ ప్రకారం..
నవంబర్‌ 2 నుంచి 9, 10, ఇంటర్ ఫస్ట్ ఇయర్, ఇంటర్ సెకండ్ ఇయర్ తరగతులు రోజు విడిచి రోజు జరుగుతాయి. అవి కూడా కేవలం ఒంటిపూట మాత్రమే. నవంబర్‌ 23 నుంచి 6, 7, 8 తరగతులకు బోధన మొదలవుతుంది. డిసెంబర్‌ 14 నుంచి 1, 2, 3, 4, 5 తరగతులను ప్రారంభిస్తారు. 1 నుంచి 8వ తరగతి వరకు కూడా రోజు విడిచి రోజు, హాఫ్‌డే మాత్రమే క్లాసులు నిర్వహిస్తారు. అన్ని ప్రభుత్వ, ప్రైవేటు విద్యా సంస్థలకు ఇదే షెడ్యూల్‌ వర్తిస్తుందని ప్రభుత్వం స్పష్టం చేసింది.

అయితే ఇప్పటికే పలు ప్రైవేట్ సంస్థల్లో 9, 10 తరగతుల విద్యార్థులకు తరగతులు ప్రారంభం అయ్యాయి. కరోనా వల్ల దాదాపు 6 నెలల పాటు విద్యార్థులు పాఠశాలలకు దూరం అయ్యారు. ఇప్పుడిప్పుడే పరిస్థితులు చక్కబడుతుండటంతో.. తల్లిదండ్రుల అనుమతితో తిరిగి స్కూళ్లకు వెళ్తున్నారు. 

మరింత సమాచారం తెలుసుకోండి: