అమెరికా ఎన్నికలకు ఇక మిగిలింది మూడు రోజులు మాత్రమే. నవంబర్ 3న శ్వేత సౌధం కొత్త అధ్యక్షుడు ఎవరో తేలిపోతుంది. డొనాల్డ్ ట్రంప్ మరోసారి అధ్యక్ష పీఠం ఎక్కాలని ఆశపడుతున్నారు. కానీ ఆయన ప్రత్యర్ధి జో బైడెన్ రోజు రోజుకు బలం పెంచుకుని దూసుకుపోతున్నారు. ఇక ట్రంప్ కి కాలం కూడా బొత్తిగా  కలసిరావడంలేదు.  అసలే ట్రంప్ విషయంలో అమెరికన్లు కోపంగా ఉన్నారు. కరోనా టైం లో ఆయన సరిగ్గా డీల్ చేయలేదన్నదే వారు ఆగ్రహానికి కారణం. దాంతో ట్రంప్ ని ఫెయిల్యూర్ నేతగా వారు చూస్తున్నారు.

సరే అమెరికా ప్రెసిడెంట్ ఎన్నికల ప్రచారం మధ్యలోకి వచ్చాక కరోనా కేసులు ఆ దేశంలో కొంత తగ్గుముఖం పట్టాయి. కానీ ఎన్నికలు దగ్గర పడుతున్న వేళ ఇపుడు ఒక్కసారిగా మళ్ళీ కేసులు పెరుగుతున్నాయట. రోజుకు 90 వేల దాక కేసులు వస్తున్నాయి. నెమ్మదించింది అనుకున్న కరోనా తిరగమోత వేయడంతో ట్రంప్ కి ఉన్న చివరి ఆశలు కూడా కొట్టుకుపోతున్నాయని అంటున్నారు. ఈ జోరు పెరిగితే రోజుకు లక్ష దాకా కేసులు త్వరలో వచ్చే అవకాశం ఉందని కూడా అంటున్నారు.

అమెరికావ్యాప్తంగా చూసుకుంటే 90 లక్షల కేసులు ఇపుడు నమోదు అయ్యాయి. రెండున్నర లక్షల మంది ఇప్పటిదాకా కరోనా కారణంగా చనిపోయారు ఎంతో మంది ఆ వ్యాధి బారిన పడి నానా రకాలుగా  ఇతర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ట్రంప్ కరోనాను  కంట్రోల్ చేసే విషయంలో మొదట్లోనే చేతులు ఎత్తేశారన్న నిందలు మోస్తూ వచ్చారు. ఇపుడు సెకండ్ వేవ్ అక్కడ పంజా విసరడంతో ట్రంప్ ఎన్నికల ఆశలను అది గండి కొడుతోంది అంటున్నారు. ఇప్పటికే కాలిఫోర్నియా వంటి పెద్ద రాష్ట్రాల్లో జో బైడెన్ దూకుడు మీద ఉన్నారు. ఈసారి ఎట్టి పరిస్థితుల్లోనూ మార్పుని తీసుకువస్తాయని అమెరికన్ యువత కూడా అంటోంది.

గత ఎన్నికల్లో ట్రంప్ కి సపోర్ట్ గా ఉన్న సీనియర్ సిటిజన్స్ కూడా మనసు మార్చుకున్నారు. మొత్తానికి చూసుకుంటే ట్రంప్ కి అన్ని విధాలుగా ప్రతికూల వాతావరణం కనబడుతోంది. దానికి తోడు అన్నట్లుగా  మరో మారు కరోనా కేసులు పెరిగి ట్రంప్ ని ఇంకా ఇబ్బందుల్లోకి నెట్టిందని అంటున్నారు. మొత్తానికి ట్రంప్ జాతకాన్ని మార్చింది అమరికన్ ఓటరాలేక  కరోనావా  అంటే రెండవదేనని అంతా గట్టిగా చెబుతున్నారు. మొత్తానికి ఏదైనా  అద్భుతం జరిగి గెలిస్తే గెలవాలి తప్ప లేకపోతే కరోనా బాధితుడిగా చరిత్రలో ట్రంప్ మిగులుతారు అంటున్నారు.




మరింత సమాచారం తెలుసుకోండి: