టీఎస్ఆర్టీసీని కరోనా కష్టాలు వెంటాడుతున్నాయి.  ఆర్థిక సమస్యలతో ఆర్టీసీ తీవ్రంగా సతమతమవుతోంది. కరోనా కారణంగా బస్సులు ఎక్కే వారే లేకపోవడంతో, ఆదాయం గణనీయంగా తగ్గిపోయింది.  ఆర్టీసీకి గుండెకాయ లాంటి హైదరాబాద్‌లో నగర ప్రయాణీకుల నుంచి అనుకున్నంత ఆదరణ లభిచండం లేదు.

హైదరాబాద్ సిటీ బస్సులు ఎక్కేవారి సంఖ్య తగ్గిపోయింది. గ్రేటర్ హైదరాబాద్‌లో మొత్తం 29 డిపోలలో దాదాపు 3వేల బస్సులున్నాయి. వీటిలో 25 శాతం బస్సులు మాత్రమే ప్రస్తుతం రాకపోకలు సాగిస్తున్నాయి. గతంలో హైదరాబాద్ రీజియన్ లో సుమారు 1700 బస్సులు, సికింద్రాబాద్ రీజియన్ లో 1200 బస్సులు ప్రయాణీకులను గమ్యస్థానాలకు చేర్చేవి. ఆర్టీసీ సమ్మె, ఆ తర్వాత లాక్‌డౌన్ కారణంగా  బస్సులు డిపోలకే పరిమితం కావడంతో ఆదాయం బాగా తగ్గిపోయింది.

పూర్తి స్థాయిలో బస్సులు నడిచినప్పుడు రోజుకు 3కోట్లకు పైగా ఆదాయం వస్తే.. ఇప్పుడు మాత్రం అందులో పావు వంతు కూడా రావడం లేదు. రోజులో 40 నుంచి 60లక్షలు మాత్రమే ఇన్ కమ్ వస్తుందంటున్నారు అధికారులు. కొన్ని రూట్లలో 20శాతం... మరికొన్ని రూట్లలో 30శాతం కంటే ఆక్యుపెన్సీ పెరగడం లేదు. దీంతో కొన్ని నెలల పాటు సిటిలో బస్సు సర్వీసుల సంఖ్య పెంచేది లేదంటున్నారు అధికారులు.

సిటీ ఆర్టీసీలో నష్టాల నివారణ కోసం కోసం మెట్రోకు కొన్ని బస్సులను హైర్ చేయాలనే ప్రతిపాదన తెరపైకి వచ్చింది. కానీ ప్రస్తుత పరిస్థితుల్లో మెట్రో పరిస్థితి కూడా అంతంత మాత్రంగానే ఉండడంతో ఆ ప్రతిపాదన తాత్కాలికంగా విరమించుకున్నట్లు తెలుస్తోంది. మెట్రోకి ఆర్టీసీ బస్సులను అద్దెకు పెట్టడం వల్ల ఖచ్చితమైన ఆదాయం వస్తుంది. దీంతో కొంత నష్టాల నుంచి బయటపడే అవకాశం ఉందని ఆర్టీసీ భావించింది. కానీ కరోనా కారణంగా అంచనాలన్నీ తలకిందులయ్యాయి.

ప్రస్తుతం ఆర్టీసీ కార్గోపై అధికారులు దృష్టిసారించారు. ప్రయాణీకుల సర్వీసుల బస్సుల కంటే.... కార్గో విభాగంలోని బస్సులకు ఆదాయం కొంత ఎక్కువగా వస్తుంది. దీంతో కార్గోని విస్తృతం చేసే ఆలోచనలో గ్రేటర్ ఆర్టీసీ అధికారులు ఉన్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: