గత కొన్ని రోజులుగా డ్రాగన్ కంట్రీ చైనా... అమెరికాలో రహస్య ఆపరేషన్ నిర్వహిస్తుంది. కాకపోతే త్వరగానే వారి చర్యలను పసిగట్టి ఆ 8 మంది చైనా రహస్య ఏజెంట్లను అక్కడి అమెరికా అధికారులు అదుపులోకి తీసుకున్నారు. నిందితులందరూ పీపుల్స్‌ రిపబ్లిక్‌ ఆఫ్‌ చైనా అధికారుల ఆదేశాల మేరకు అమెరికాలో నిఘా కార్యక్రమాలు చేస్తున్నట్లుగా గుర్తించారు. షీ జిన్‌పింగ్‌ నేతృత్వంలోని చైనా ప్రభుత్వం రహస్యంగా నిర్వహిస్తున్న ‘ఆపరేషన్‌ ఫాక్స్‌ హంట్‌’లో వీరు భాగమని తెలిపారు. అమెరికాలో నివసిస్తున్న కొంత మందిని చట్ట విరుద్ధంగా చైనాకు తరలించాలని వాళ్లు ప్రయత్నిస్తున్నట్లు తేలింది. ఈ క్రమంలో కొందరిపై దాడులు చేశారని, మరి కొంత మందిని వేధిస్తున్నారని అమెరికా అధికారులు తెలిపారు.

తమ దేశం నుంచి పారిపోయిన వారిని ఎక్కడున్నా సరే వెతికి పట్టుకొచ్చేందుకు చైనా చట్ట విరుద్ధమైన ఆపరేషన్ చేపట్టింది. ఆ దేశం నుంచి అమెరికా పారిపోయి ప్రాణాలు కాపాడుకోవాలనుకుంటున్న వారిని కూడా తిరిగి రప్పించేందుకు ప్రయత్నిస్తున్నారు. ఇందుకోసం ఎంతకైనా తెగిస్తున్నారు. షీ జిన్‌పింగ్‌ అధికారంలోకి వచ్చిన తర్వాతే చైనా ‘ఆపరేషన్‌ ఫాక్స్‌ హంట్‌’ను చేపట్టింది. సాధారణంగా నేరగాళ్లను అప్పగించుకోవడానికి ఆయా దేశాలు తాము కుదుర్చుకున్న ఒప్పందాల ప్రకారం నడుచుకుంటాయి. ఆ ఒప్పందాల ప్రకారమే నేరస్థుల అప్పగింతలు ఉంటాయి. కానీ, చైనా ఇలాంటి ఒప్పందాలను ఖాతరు చేయకుండా చట్టవిరుద్ధంగా నేరస్థులను తరలించే కార్యక్రమాన్ని చేపట్టింది. ఆశ్చర్యకరమైన విషయం ఏమిటంటే.. వీరిలో నేరాలు చేసిన వారికంటే షీ జిన్‌పింగ్‌ను, కమ్యూనిస్టు ప్రభుత్వాన్ని వ్యతిరేకించిన వారే ఎక్కువగా ఉన్నారు. వారిపై వివిధ అభియోగాలు మోపి వేధిస్తున్నారు.

అమెరికా ఎఫ్‌బీఐ (Federal Bureau of Investigation), డిపార్ట్‌మెంట్‌ ఆఫ్‌ జస్టిస్‌ అధికారులు ఈ ‘ఫాక్స్‌హంట్’ గుట్టును రట్టు చేశాయి. బుధవారం (అక్టోబర్‌ 28) 8 మంది చైనా ఏజెంట్లను అదుపులోకి తీసుకున్నట్లు వెల్లడించాయి. పలువురిని వెంటాడేందుకు, అమెరికా నుంచి తరలించేందుకు వీరిలో ఆరుగురు కుట్రలు పన్నుతున్నట్లు గుర్తించామని అధికారులు తెలిపారు. అరెస్టైన వారిలో వుహాన్‌ పబ్లిక్‌ సెక్యూరిటీ బ్యూరోలో పోలీస్‌ అధికారిగా పనిచేస్తున్న వ్యక్తి కూడా ఉన్నారు. చైనా నుంచి పారిపోయిన నేరగాళ్లను పట్టుకునేందుకు షీ జిన్‌‌పింగ్ ప్రభుత్వం 2014లో అత్యంత రహస్యంగా Operation Fox Hunt చేపట్టింది. 2015 నాటికి 800 మంది అవినీతి అధికారులను పట్టుకొచ్చినట్లు చైనా అధికారిక మీడియా గొప్పగా ప్రకటించింది. ఫాక్స్ హంట్‌లో భాగంగా టార్గెట్ చేసిన వ్యక్తుల కుటుంబ సభ్యులకు హాని చేస్తామని బెదిరించి వారిని పట్టుకున్న సందర్భాలు ఉన్నాయి. కొంత మందిని కిడ్నాప్ చేసి చైనాకు పట్టుకెళ్లిన ఘటనలు ఉన్నాయి. న్యూజెర్సీలో జాన్‌డోయి అనే వ్యక్తిని రప్పించేందుకు చైనా అధికారులు 2016 నుంచి ప్రయత్నం చేస్తున్నారు. ఆ వ్యక్తి తండ్రితో చాలా మంది చైనా అధికారులు అక్కడకు వచ్చి వెళ్లారు. ‘నువ్వు బుద్ధిగా చైనా వస్తే పదేళ్లు జైల్లో ఉంటావు. నీ భార్య, కూతురు సురక్షితంగా ఉంటారు’ అని అతడి ఇంటి వద్ద బెదిరింపు నోటీసులు అంటించారు. బాధితుడి కుటుంబసభ్యులు చైనాలో ఉండటంతో వారిని తీవ్రంగా వేధించారు. అతడి కుమార్తెను ఆన్‌లైన్‌లో వేధించడం మొదలు పెట్టారు. బాధితుడి సోదరిని చైనాలో అరెస్టు చేశారు.

డొనాల్డ్ ట్రంప్‌ అధికారంలోకి వచ్చిన తర్వాత అమెరికా ప్రభుత్వం చైనాను అదుపుచేయడానికి ఈ ‘ఫాక్స్‌హంట్‌’పై దృష్టి పెట్టింది. జులైలో హడ్సన్‌ ఇన్‌స్టిట్యూట్‌లో జరిగిన ఓ కార్యక్రమంలో ఎఫ్‌బీఐ డైరెక్టర్‌ క్రిస్టఫర్‌ ప్రసంగిస్తూ ఫాక్స్‌ హంట్‌‌ గురించి ప్రస్తావించారు. చట్టాలను చైనా తుంగలో తొక్కుతోందని, ఫాక్స్ హంట్ బాధితులు ఎఫ్‌బీఐని ఆశ్రయిస్తున్నారని చెప్పుకొచ్చారు. న్యూయార్క్‌ పోలీస్‌ విభాగంలో పనిచేస్తున్న ఓ టిబెటన్‌ చైనా ఏజెంట్‌గా పనిచేస్తున్నట్లు అమెరికా అధికారులు గుర్తించారు. సెప్టెంబర్‌లో అతడిపై కేసు పెట్టారు. స్థానికంగా నివాసం ఉంటున్న కొంత మంది చైనీయులపై అతను నిఘా వేసి, ఆ సమాచారం చైనాకు పంపుతున్నట్లు ఎఫ్‌బీఐ అధికారులు గుర్తించారు. ఎప్పటిలాగే చైనా తమ చర్యను సమర్థించుకోవడం గమనార్హం. అమెరికాలో తమ అధికారులు చట్ట ప్రకారమే వ్యవహరించారని చైనా విదేశాంగ శాఖ ప్రతినిధి వాంగ్‌వెన్‌బిన్‌ పేర్కొన్నారు. చైనా ప్రతిష్టను మసకబార్చడానికి అమెరికా వాస్తవాలను వక్రీకరిస్తోందని ఆరోపించారు. అమెరికా తన తప్పును వెంటనే సరిదిద్దుకోవాలని హెచ్చరించింది డ్రాగన్ కంట్రీ చైనా.

మరింత సమాచారం తెలుసుకోండి: