ఏపీ ప్రభుత్వ మరో కీలక నిర్ణయం తీసుకుంది. మద్యం ధరలను భారీగా తగ్గిస్తున్నామంటూ ప్రభుత్వం నిన్న ప్రకటన జారీ చేసింది. అయితే ఈ తగ్గింపు ప్రకటనతో ధరలు తగ్గాయా అంటే అదీ లేదు.. భారీ స్థాయిలోనే ధరలు కొనసాగుతున్నాయి. దీంతో మందుబాబులకు ప్రభుత్వం మరోసారి షాకిచ్చింది. అయితే ఆంధ్రప్రదేశ్ కంటే తెలంగాణ రాష్ట్రంలో మద్యం ధరలు చౌకగా దొరుకుతున్నాయి. తెలంగాణలో ధరలు తక్కువగా ఉండటంతో మద్యంను అక్రమంగా రవాణా చేస్తున్నారు.

అయితే ప్రభుత్వం ధరలు తగ్గించినా అక్రమ మద్యం రవాణాకు అడ్డుకట్ట వేయలేకపోతున్నారు. బ్రాండెడ్ బాటిళ్ల కోసం మద్యం ప్రియులు ఉవ్విళ్లూరుతుంటారు. నిజానికి ఏపీ ప్రభుత్వం మద్యం అక్రమ రవాణాను నిలువరించేందుకే ధరలను తగ్గించింది. గరిష్టంగా లీటర్ మద్యం బాటిల్ పై ఏకంగా రూ.1,350 వరకు తగ్గింపు ఉంటుందని ప్రభుత్వం ప్రకటించింది.

వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక మొత్తంగా మూడు సార్లు మద్యం ధరలను పెంచింది. 2019లో రూ.50కే ఉన్న చీప్ లిక్కర్ ఇప్పుడు 200కు చేరింది. అయితే తాజాగా తీసుకున్న తగ్గింపు నిర్ణయంలో చీప్ లిక్కర్ ను చేర్చలేదు. ధరలు పెంచడంతో ఆటోమెటిక్ గా తాగుడును నియంత్రించవచ్చని భావించిన ప్రభుత్వం ఇప్పుడు మళ్లీ ధరలను తగ్గించింది.

ఇతర ప్రీమియం బ్రాండ్లతో పాటు చీప్ లిక్కర్ ధరలు తగ్గించకపోవడంపై పలు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఒకవేళ బ్రాండెండ్ బాటిళ్ల ధరతో పాటు చీప్ లిక్కర్ ధరను కూడా తగ్గిస్తే ప్రజలు మళ్లీ తాగుడు బానిసవుతారని భావించి ఉండవచ్చు. కేవలం 30 శాతం వరకు అమ్మకాలుండే మీడియం, ప్రీమియం బ్రాండ్ల ధరలు మాత్రం తగ్గించింది. అయితే ధరలు ఎంత తగ్గించినా పెద్దగా ఫలితం ఉండదని పలువురు ఆరోపిస్తున్నారు. మూడు సార్లు కలిపి 120 శాతం వరకు పెరిగితే.. ఇప్పుడు తగ్గింపు కేవలం 50 శాతంలోపే ఉందని పేర్కొంటున్నారు. ఈ ధరలతో పోల్చినా ఇప్పటికీ తెలంగాణ కంటే ఏపీలోనే మద్యం ధరలు ఎక్కువగా ఉన్నాయని వాళ్లు చెబుతున్నారు. ఈ స్థాయిలో మద్యం ధరలు తగ్గించినా అక్రమ రవాణాను కట్టడి చేయలేరని ఆరోపిస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: