ఇప్పటి వరకు అడగనివారిదే తప్పు అన్నట్టుగా.. అడినవారందరికీ వరాలిచ్చుకుంటూ వెళ్లారు సీఎం జగన్మోహన్ రెడ్డి. అయితే తొలిసారి వరాలివ్వడంతోపాటు.. వారికి షాకింగ్ న్యూస్ కూడా చెప్పారు. ఏపీలో వయసు అర్హతగా ఇచ్చే పింఛన్లకు ఆధార్ కార్డ్ ని ప్రామాణికంగా తీసుకుంటున్నారు. ఇదే అదనుగా కొంతమంది అక్రమార్కులు ఆధార్ కార్డ్ లో వయసుని తప్పుగా నమోదు చేయించుకుంటున్నారు. అలా తప్పుడు వయసుని చూపించి పింఛన్లకు అర్హులుగా మారిపోతున్నారు. ఇలాంటి వారందరికీ ఏపీ సర్కారు షాకివ్వబోతోంది. ఆధార్ కార్డుల్లో వయసుని అప్ డేట్ చేసినవారందరి పింఛన్ వ్యవహారాలు వచ్చే నెలలో సమీక్షించబోతున్నారు.
కొత్తగా వచ్చే పింఛన్ల దరఖాస్తుల్లో ఆధార్‌ కార్డులో వయసుకు సంబంధించి జరిగిన మార్పులు, చేర్పుల వివరాలను తప్పనిసరిగా పరిశీలించాలని ప్రభుత్వం నిర్ణయించింది. అనర్హులు లబ్ధి పొందకుండా ఈ కొత్త నిబంధన తీసుకొచ్చినట్టు అధికారవర్గాలు తెలిపాయి. కొత్త నిబంధన ప్రకారం పింఛనుకు దరఖాస్తుచేసుకునేవారు తమ ఆధార్‌ కార్డు అప్‌డేట్‌ హిస్టరీ ని కూడా సమర్పించాలి. ఆధార్ కార్డ్ జిరాక్స్ తోపాటు, హిస్టరీ ప్రింట్‌ అవుట్‌ కూడా దరఖాస్తుతో జతచేయాలి. మార్పులు, చేర్పులు జరిగి ఉంటే.. ఆధార్‌ కార్డులో తక్కువ వయసును పరిగణనలోకి తీసుకుంటారు. దరఖాస్తుదారు వయసు అర్హత నిబంధనల ప్రకారం ఉంటేనే ఆ దరఖాస్తును తదపరి దశ పరిశీలనకు పంపుతారు. లేనిపక్షంలో సచివాలయాల్లో డిజిటల్‌ అసిస్టెంట్‌ స్థాయిలోనే తిరస్కరిస్తారు.  

అయితే వాస్తవంగా దరఖాస్తుదారుడికి ఆధార్‌ కార్డు మంజూరు సమయంలో వయసు తప్పుగా నమోదై, రిజెక్ట్ అయి ఉంటే.. తిరిగి అప్పీలు చేసుకోవడానికి ప్రభుత్వం అవకాశం కల్పించింది. అలాంటి దరఖాస్తుదారులు వయసు ధ్రువీకరణకు మరికొన్ని పత్రాలను జతచేస్తూ సచివాలయాల్లో అప్పీలు చేసుకోవాలి. వీటిని ఎంపీడీవోలు, మున్సిపల్‌ కమిషనర్లు స్వయంగా పరిశీలించి, అర్హులైతే పింఛను మంజూరుకు ఆదేశిస్తారు. వైసీపీ ప్రభుత్వం వచ్చాక జనవరి నుంచి ఇప్పటి వరకు 12లక్షల 42వేలమందికి కొత్తగా పింఛన్లు మంజూరు చేశారు. వీరిలో కూడా చాలామంది తప్పుడు ఆధార్ ధృవీకరణతో పింఛన్లు పొందినట్టు ఆరోపణలున్నాయి. వీటిపై కూడా ప్రభుత్వం సీరియస్ గా దృష్టిపెట్టింది. తక్కువ వయసు ఉండి, ఆధార్‌లో మార్చుకుని పింఛను పొందారని నిర్ధారణ అయితే వారి పింఛను తొలగిస్తామని అధికారులు హెచ్చరిస్తున్నారు. అదే జరిగితే ఏపీలో భారీగా పింఛన్లలో కోత పడుతుందని అంచనా వేస్తున్నారు. 

మరింత సమాచారం తెలుసుకోండి: