అన్ లాక్ నిబంధనల సడలింపులో భాగంగా.. నవంబర్ 2 నుంచి, ప్రభుత్వ, ప్రైవేట్ స్కూల్స్ తెరుచుకోబోతున్నాయి. అయితే కేవలం 9, 10 తరగతులకు మాత్రమే నవంబర్ 2 నుంచి క్లాసులు మొదలవుతాయి. నవంబర్ 23నుంచి 6, 7, 8 తరగతుల వారికి పాఠాలు చెప్పడం ప్రారంభిస్తారు. ఇక 1నుంచి 5 తరగతుల విద్యార్థులు డిసెంబర్ 14 వరకు వేచి చూడాల్సిందే. ఈ నేపథ్యంలో విద్యార్థుల హాజరుపై ప్రభుత్వం జారీ చేసిన తాజా మార్గదర్శకాలు మరింత ఇబ్బందిగా మారాయి.
ఏపీలో నవంబర్‌ 2 నుంచి స్కూళ్ల ప్రారంభంపై పాఠశాల విద్యాశాఖ మార్గదర్శకాలు రూపొందించింది. కరోనా నేపథ్యంలో విద్యార్థులకు, టీచర్లకు ఎలాంటి ఇబ్బంది కలగకుండా ఉండేలా చర్యలు చేపడుతున్నారు. ఒక్కో తరగతి గదిలో 16 మందికి మించకుండా ఉండాలని నిర్ణయించారు. విద్యార్థుల మధ్య దూరం కనీసం 6 అడుగులు ఉండేలా సీటింగ్‌ ఏర్పాట్లు చేస్తున్నారు. రోజువిడిచి రోజు తరగతుల నిర్వహణ, ఆన్‌లైన్, ఆఫ్‌లైన్‌ బోధన తదితర అంశాలను మార్గదర్శకాల్లో పొందుపరిచారు.  

ఈ మార్గదర్శకాలతో తీవ్రంగా ఇబ్బంది పడేది ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులే. ప్రైవేట్ స్కూల్స్ లో  ఎలాగు తరగతి గదికి 30మందికి మించరు. సెక్షన్లు ఉంటాయి. తగినన్ని అదనపు గదులు కూడా అందుబాటులో ఉంటాయి. అంటే ప్రైవేట్ పాఠశాలలకు 16మంది విద్యార్థులు, 6 అడుగుల దూరం అనేది వర్కవుట్ అవుతుంది. ప్రభుత్వ పాఠశాలల్లో మాత్రం ఇది కుదిరేలా కనిపించలేదు. అసలే ఇరుకిరుకు గదులు, 9, 10 తరగతుల్లో చాలాచోట్ల తరగతికి 100మంది విద్యార్థులుంటారు. సెక్షన్లు ఉంటే ఉంటాయి లేకపోతే లేదు. నవంబర్ 23 వరకు అంటే 6, 7, 8 తరగతుల విద్యార్థులు వచ్చే వరకు వారికి ఇబ్బంది ఉండదు. ఆ తర్వాతే అసలు సమస్య. 16మందిని మాత్రమే క్లాస్ లోకి అనుమతించాలి, రోజు మార్చి రోజు క్లాసులు వినాలంటే వారకి కుదరదు. కనీసం వారికి వెసులుబాటు కల్పించేలా నిర్ణయాన్ని మార్చాల్సి ఉంటుంది. 6 అడుగుల దూరం నిబంధన అమలు చేయాలంటే.. రోజు మార్చి రోజు కాకుండా.. మూడు రోజులకోసారి వీరికి పాఠాలు చెప్పాల్సి ఉంటుంది. స్థానికంగా సాధ్యాసాధ్యాలను బట్టి.. విద్యార్థులకు వెసులుబాటు కల్పించేలా అధికారులు నిర్ణయం తీసుకోవాలని తల్లిదండ్రులు కోరుతున్నారు. రాష్ట్రవ్యాప్తంగా ఒకటే నిబంధన పెడితే.. చాలా చోట్ల ప్రభుత్వ స్కూళ్ల విద్యార్థులు ఇబ్బంది పడే ప్రమాదం ఉంది. 

మరింత సమాచారం తెలుసుకోండి: