రెండు తెలుగు రాష్ట్రాల్లో వరద బీభత్సానికి పేదలు తీవ్ర ఇబ్బంది పడ్డారు. ముఖ్యంగా హైదరాబాద్ వాసులు రోజుల తరబడి వరద నీటిలోనే కాపురం చేశారు. ఎక్కడికక్కడ పరామర్శ యాత్రలు చేసిన టీఆర్ఎస్ నేతలు వారికి ఆర్థిక సాయాన్ని అందించారు. చాలా చోట్ల నేతలు తమ సొంత నిధులతో పేదల్ని ఆదుకున్నారు. ముంపు బారిన పడిన ప్రాంతాల్లో ప్రతి కుటుంబానికి రూ.10వేలు, ముంపు లేకుండా వరద నీటితో ఇబ్బంది పడిన ప్రాంతాల్లో కుటుంబానికి రూ.5వేలు ఇవ్వాలనేది ప్రభుత్వం ప్రతిపాదన. దీని ప్రకారం ఇప్పటికే జీహెచ్ఎంసీ పరిధిలో మొత్తం 33 కోట్ల రూపాయలు పరిహారంగా అందించాలి. ఇప్పటి వరకూ 14 కోట్ల రూపాయలు బాధితులకు పంచేసినట్టు రికార్డులు చెబుతున్నాయి.

విచిత్రం ఏంటంటే.. పంచిన 14కోట్లలో.. సగం డబ్బు అంటే 7 కోట్ల రూపాయలు తిరిగి నేతలు, వారి అనుచరుల జేబుల్లోకే వెళ్లిపోయాయట. అవును హైదరాబాద్ మహా నగరంలో వరద సహాయం వివాదంగా మారుతోంది. వరద నీటితో నష్టపోయిన వారికి కాకుండా అనర్హులకు ఇచ్చారని, మునిగిపోయిన తమను పక్కన పెట్టారంటూ గురువారం గడ్డిఅన్నారం, చంపాపేట, ఉప్పల్, రామంతాపూర్ ప్రాంతాలతోపాటు.. 4, 5 డివిజన్లలో ప్రజలు ఆందోళనకు దిగారు. కార్పొరేటర్లను చుట్టుముట్టారు,  మున్సిపల్‌ అధికారులను నిర్బంధించారు. ఉప్పల్‌లో మున్సిపల్‌ కార్యాలయం ఎదుట నిరసన ప్రదర్శన చేపట్టి, అక్కడే భోజనాలు చేసి ఆందోళనకు దిగారు.
14కోట్ల పంపిణీలో.. అధికారులు సిద్ధం చేసిన జాబితాపై విమర్శలు వినిపిస్తున్నాయి. క్షేత్ర స్థాయిలో పరిశీలించకుండా, కార్పొరేటర్లు, నాయకులకు చెప్పిన ప్రాంతాలను సైతం జాబితాలో చేర్చారని  అంటున్నారు బాధితులు. కొన్ని డివిజన్లలో స్థానిక టీఆర్‌ఎస్‌ నాయకుల వ్యవహారం తలనొప్పిగా మారింది. నగదు పంపిణీ అయిన తర్వాత డబ్బులు వసూలు చేస్తుండంతో ఇటీవల మౌలాలి డివిజన్‌లో ముగ్గురిని పార్టీ నుంచి సస్పెండ్‌ చేశారు. అయినా నాయకుల తీరు మారడం లేదు. 10వేలు చేతిలో పెట్టి సంతకం చేయించుకుని వెంటనే అందులో 5వేలు తీసుకుంటున్నారు. అలా ఇవ్వను అంటున్న వారికి అసలు పరిహారం లేకుండా చేస్తున్నారు. దాదాపుగా టీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలు, అభిమానులకే ఇలా వరదసాయాన్ని పప్పు బెల్లాల్లా పంచిపెడుతున్నారని ప్రజలు విమర్శిస్తున్నారు. ప్రభుత్వం ఉదారంగా వరదసాయాన్ని పంచినా కూడా పేదలకు అది అందడంలేదు. దీంతో కేసీఆర్ సర్కారు ఈ విషయంపై నష్టనివారణ చర్యలు చేపట్టింది. వరదసాయం అందకపోతే వెంటనే అధికారులకు ఫిర్యాదు చేయాలని సూచించారు. సంబంధిత డివిజన్ కార్పొరేటర్లకు కూడా ఫిర్యాదు చేయాలని చెప్పారు. కమిషన్ కింద డబ్బులు ఎవరు అడిగినా ఇవ్వొద్దని చెప్పారు నేతలు. 

మరింత సమాచారం తెలుసుకోండి: