క‌రోనాతో రియ‌ల్ ఎస్టేట్ వ్యాపారం దారుణంగా ప‌డిపోయింది. వాస్త‌వానికి లాక్‌డౌన్ త‌ర్వాత పుంజుకుంటుంద‌ని భావించినా  తెలంగాణ రాష్ట్ర ప్ర‌భుత్వం తీసుకుంటున్న నిర్ణ‌యాల‌తో సామాన్యులు భూముల జోలికి వెళ్లాలంటేనే జడుసుకుంటున్నారు. పైగా ఎల్ ఆర్ ఎస్ క‌ట్ట‌లేని వాళ్లు అగ్గువ స‌గ్గువ‌కు భూముల‌ను అమ్ముకున్న సంఘ‌ట‌న‌లు మ‌నం చూస్తున్నాం. మరో 15 రోజుల్లో రిజిస్ట్రేషన్లు మొదలవుతాయని సీఎం కేసీఆర్ ప్రకటించినా మునుపున్నంత ఊపు క‌నిపించ‌డం లేద‌ని వ్యాపారులు వాపోతున్నారంట‌. దీనికి తోడు ధరణి ప్ర‌క్రియ విధానం కూడా  రియల్ ఎస్టేట్ రంగంలో తీవ్ర ప్రభావం చూపేట్లు కనిపిస్తోంద‌ని వ్యాపారులు పేర్కొంటున్నారు.



గ‌తంలో కేంద్ర ప్రభుత్వం తీసుకున్న పెద్దనోట్ల రద్దు వ్యవహారంతో చాలా రోజుల పాటు రియ‌ల్ వ్యాపారం ఆగిపోయింది. అనుకున్నంత వ్యాపారం లేక లావాదేవీలు పూర్తిగా నిలిచి పోయాయి. ఆ త‌ర్వాత కొద్దిగా కొలుకున్నా.. ఇంత‌లో క‌రోనా..లాక్‌డౌన్‌..ఇప్పుడు ప్ర‌భుత్వ తాజా నిబంధ‌న‌ల‌తో ఆర్థిక భారాల‌తో వెంచ‌ర్ల‌లో ప్లాట్ల కొనుగోలుకు, బ‌య‌ట వ్య‌క్తిగ‌త ప్లాట్ల కొనుగోలుకు జ‌నాలు జంకుతున్నారు.  ఇదిలా ఉండ‌గా అక్రమ లేఅవుట్లు, అక్రమ ప్లాట్లను క్రమబద్ధీకరించేందుకు ఎల్ఆర్ఎస్ పథకాన్ని ప్ర‌భుత్వం కొన‌సాగిస్తోంది.  ఈ నెలాఖరు వరకు దరఖాస్తులను తీసుకునే ప్రక్రియ నడుస్తోంది. ఈ క్రమంలోనే లక్షలాదిగా దరఖాస్తులు వస్తున్నట్లు అధికారులు చెబుతున్నారు. ప్లాట్ల రిజిస్ట్రేషన్లు ఎప్పటికి ప్రారంభమవుతాయో అర్థం కాక జనం తల్లడం మల్లడమవుతున్నారు.



లాక్ డౌన్, కరోనాకు ముందు హెచ్ఎండీఏ పరిధిలోని ప్రతి ఊర్లో రియల్ ఎస్టేట్  వ్యాపారం ఆకాశ‌మే హ‌ద్దుగా సాగింది. ఇప్పుడేమో  వెంచర్లన్నీ బోసిపోయి క‌నిపిస్తున్నాయి.  ఒప్పందం కుదుర్చుకున్న భూ అమ్మ‌కాల‌కు సంబంధించిన ప్ర‌క్రియ‌లో అనేక మంది వ్యాపారులు ఇరుక్కుపోయార‌నే చెప్పాలి. వ‌డ్డీల‌కు వ‌డ్డీలు క‌ట్టాల్సి వ‌స్తోందిన బెంబెలెత్తిపోతున్నారు.ఇప్పట్లో రిజిస్ట్రేషన్ చేసుకునేంత డబ్బులు చేతికందే అవకాశం లేకపోవడం, మరొకరి చేతి కొనిపించేంత స్థాయి కనుచూపు మేరలో లేవు. దాంతో అప్పులకు వడ్డీలు కట్టడం కంటే అగ్రిమెంటు సొమ్మును తిరిగి తీసుకోవడమే ఉత్తమమన్న అభిప్రాయంలో ఉన్నారు.






మరింత సమాచారం తెలుసుకోండి: