జీహెచ్ఎంసీ ప‌రిధిలోని వ‌ర‌ద బాధితుల‌ను ఆదుకునేందుకు ప్ర‌భుత్వం అర్హులైన పేద‌ల‌కు రూ.10వేలు అందిస్తున్న విష‌యం తెలిసిందే. దీంతో అర్హుల గుర్తింపులో స్ప‌ష్ట‌త తీసుకురావ‌డంలో అధికార యంత్రాంగం విఫ‌ల‌మైంద‌న్న విమ‌ర్శ‌లు వినిపిస్తు న్నాయి. దీనికితోడు అధికార పార్టీకి చెందిన నేత‌ల‌, ప్ర‌జాప్ర‌తినిధుల మితిమీరిన జోక్యంతో సాయం పంపిణీపై ఆరోప‌ణ‌లు వ‌స్తున్నాయి. అధికార పార్టీకి అనుకూలంగా మాట్లాడిన వారికే అంద‌జేస్తున్నార‌న్న విమ‌ర్శ‌లు వినిపిస్తున్నాయి. ఇక కార్పోరేట‌ర్ల తీరు కూడా ఏమాత్రం బాగోలేద‌ని, అర్హుల‌ను ప‌ట్టించుకోకుండా త‌మ‌కు తెలిసిన వార‌ని, అనుచ‌రుల‌ని భావించిన వారికే సాయం అంద‌జేస్తున్నార‌న్న విమ‌ర్శ‌లు పెద్ద ఎత్తున వినిపిస్తున్నాయి.



అధికారుల‌కు ఫిర్యాదు చేస్తున్నా ప‌ట్టించుకోవ‌డం లేద‌ని ప‌లు డివిజ‌న్ల‌లో అర్హులు ఆందోళ‌న‌కు దిగారు.. దిగుతున్నారు కూడా. ఈ ప‌రిణామాల నేప‌థ్యంలో ఇప్ప‌టి వ‌ర‌కు సాయం అంద‌జేసిన వారి జాబితాను తెప్పించుకోవ‌డంతో పాటు సాయంను నిలిపివేయాల‌ని ప్ర‌భుత్వం నిర్ణ‌యం తీసుకున్న‌ట్లుగా తెలుస్తోంది. ఈమేర‌కు ఉన్నత స్థాయి ఆదేశాల నేపథ్యంలో రూ.10 వేల సాయం అందజేతను తాత్కాలికంగా నిలిపివేసినట్టు తెలిసింది. ఈమేర‌కు  జీహెచ్‌ఎంసీ ఉన్న‌తాధికారులు కిందిస్థాయి అధికారుల‌కు ఇప్ప‌టికే ఆదేశాలు కూడా జారీ చేశారు. శుక్రవారం సెలవుదినం కావడంతో గ్రేటర్‌లోని మెజారిటీ ప్రాంతాల్లో సాయం పంపిణీ జరగలేదు. ఇప్పటివరకు అందజేసింది పోను.. మిగతా మొత్తాన్ని శనివారం జోనల్‌ కార్యాలయాల్లోని ఫైనాన్షియర్‌ అడ్వయిజర్‌ (ఎఫ్‌ఏ) ఖాతాలో జమ చేయాలని జీహెచ్‌ఎంసీలోని ఉన్నతాధికారి ఆదేశాలు జారీ చేసినట్లు సమాచారం.


స‌రిగ్గా 20 రోజుల క్రితం రాష్ట్ర రాజ‌ధాని హైద‌రాబాద్‌ను రికార్డు వ‌ర్షపాతం అత‌లాకుత‌లం చేసిన విష‌యం తెలిసిందే. హైద‌రాబాద్‌లోని అనేక చెరువులు, కుంట‌లు క‌బ్జాల‌కు గుర‌వ‌డంతో నీరు నిలిచే మార్గం లేక వ‌ర‌ద‌ లోతట్టు ప్రాంతాల‌ను, కాల‌నీల‌ను ముంచెత్తింది. అనేక చోట్ల ఇళ్లు నేల‌మ‌ట్ల‌మ‌య్యాయి. ఈనేప‌థ్యంలో వ‌ర‌ద‌ల‌తో రిజర్వాయర్లు, విద్యుత్తు స్తంభాలు, రహదారులపై కూలిన చెట్ల వివరాలను సేకరించి వెంటనే సహాయక చర్యలు చేపట్టింది. అలాగే వ‌ర‌ద కార‌ణంగా న‌ష్ట‌పోయిన పేద ప్ర‌జ‌ల‌కు సాయం అందించేందుకు రూ.10వేల‌ను ప్ర‌క‌టించింది. చెప్పిన‌ట్లుగా వేలాదిమంది ప్ర‌జ‌ల జాబితాను ప్ర‌భుత్వం తయారు చేసింది. అయితే అర్హులైన త‌మ‌కు సాయం అంద‌లేద‌ని ఆందోళ‌న‌లు జ‌రుగుతున్నాయి. ఇది వ‌చ్చే ఎన్నిక‌ల‌పైనా ప్ర‌భావం చూపుతుంద‌న్న ఆందోళ‌న అధికార పార్టీలో నెల‌కొంది.

మరింత సమాచారం తెలుసుకోండి: