పోలవరం ప్రాజెక్ట్ పై  ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం పక్కా ప్లాన్ తో వెళుతోంది. విభజన చట్టం ప్రకారం ప్రాజెక్టు నిర్మాణ బాధ్యత కేంద్రానిదే అని ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి‌ ప్రధాన మంత్రి  నరేంద్ర మోడీకి ఇప్పటికే లెటర్ కూడా రాశారు. త్వరలోనే ప్రధానిని కలిసేందుకు ప్రయత్నాలు కూడా మొదలు పెట్టేశారు. ఇప్పటికే ఈ విషయంపై రాష్ట్ర జలవనరుల శాఖ ఉన్నాతాధికారులు దేశ రాజధానిలో పర్యటిస్తున్నారు.  

పోలవరం ప్రాజెక్టు కేటాయింపుల్లో కేంద్రం ప్రభుత్వం లాజిక్ గా ముందుకు వెళుతుండటంతో  ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అలర్ట్‌ అయ్యింది. ప్రాజెక్టు నిర్మాణ బాధ్యత తమదే అయినా... 2013-14 అంచనాల ప్రకారం నిధులు ఇస్తే చాలని గత టీడీపీ ప్రభుత్వం అంగీకరించిందని కేంద్ర ఆర్ధిక శాఖ తేల్చి చెప్పటంతో సీఎం జగన్‌ రంగంలోకి దిగారు. పోలవరం విషయంలో ప్రధాని మోడీకి ఏడు పేజీల లేఖ రాశారు. 2014 రాష్ట్ర పునర్విభజన చట్టం సెక్షన్ 90 ప్రకారం పోలవరాన్ని జాతీయ ప్రాజెక్టుగా ప్రకటించారని గుర్తు చేశారు. ఖర్చుతో సంబంధం లేకుండా వంద శాతం నిర్మాణ బాధ్యత భరిస్తామని చట్టంలో పేర్కొన్న అంశాన్ని ప్రధానికి రాసిన లేఖలో జగన్‌ ప్రస్తావించారు.

 మరోవైపు వీలైతే స్వయంగా ప్రధానికి కలిసి ఈ అన్ని అంశాలను వివరించాలనే ఉద్దేశంలో ముఖ్యమంత్రి ఉన్నారు. త్వరలోనే ప్రధానిని కలుస్తారని నీటి పారుదల శాఖ మంత్రి అనీల్ కుమార్‌ వెల్లడించారు. నవంబర్ 2న పోలవరం ప్రాజెక్టు అథారిటీ సమావేశం హైదరాబాద్‌లో ఉండనుంది. దీనికి సంబంధించిన కసరత్తు కూడా ప్రభుత్వం చేస్తోంది. పరిణామాలు ఎలా ఉన్నా ఇచ్చిన మాట ప్రకారం వచ్చే ఏడాది డిసెంబర్‌  నాటికి పోలవరం పూర్తి చేసి తీరతామని మంత్రి ధీమా వ్యక్తం చేశారు.

మరోవైపు  పోలవరం ప్రాజెక్టు పట్ల కేంద్ర ప్రభుత్వం అనుసరిస్తున్న వైఖరిపై బెజవాడ వేదికగా రౌండ్ టేబుల్ సమావేశం జరిగింది. రైతు సంఘం రాష్ట్ర నేతలు, సీపీఐ, కాంగ్రెస్, సీపీఎం నేతలు ఈ సమావేశంలో పాల్గొన్నారు. పోలవరం పై కేంద్రం వైఖరి మారాలని, ఏపీలో అన్ని రాజకీయ పక్షాలు ఏకమై ప్రాజెక్ట్ నిర్మాణం కోసం పోరాడాలని తీర్మానించారు.

మరింత సమాచారం తెలుసుకోండి: