దేశంలో తొలి సీప్లేన్‌ సేవలు ప్రారంభమయ్యాయి. స్టాట్యూ ఆఫ్ యూనిటీ నుంచి సబర్మతి రివర్‌ఫ్రంట్ వరకు సీప్లేన్‌లో విహరించడం ద్వారా దీనిని ప్రారంభించారు ప్రధాని నరేంద్ర మోడీ. సర్దార్ వల్లభాయ్ పటేల్ జయంతి ఉత్సవాల సందర్భంగా సీ ప్లేన్‌ సేవలకు శ్రీకారం చుట్టారు.

ప్రధాన మంత్రి మోడీ మన దేశంలో మొట్ట మొదటి సీప్లేన్ సర్వీస్‌ను  ప్రారంభించారు. ప్రపంచంలో అత్యంత ఎత్తయిన విగ్రహం 'స్టాట్యూ ఆఫ్ యూనిటీ'ని వీక్షిస్తూ ఈ సీప్లేన్‌లో ప్రయాణించవచ్చు. గుజరాత్‌లోని అహ్మదాబాద్-కేవడియా మధ్య ఈ సీప్లేన్ సేవలు అందుబాటులో ఉంటాయి. రేపటి నుంచి సీప్లేన్‌ సేవలు పర్యాటకులకు అందుబాటులోకి వస్తాయి.

మోడీ  'స్టాట్యూ ఆఫ్ యూనిటీ' నుంచి సబర్మతి రివర్‌ఫ్రంట్ వరకు ఈ సీప్లేన్‌లో విహరించారు. గుజరాత్ పర్యాటక రంగానికి ఈ సేవల వల్ల గొప్ప ఊతం లభిస్తుందని, ఎక్కువ సంఖ్యలో పర్యాటకులు ఆకర్షితులవుతారని ఆశిస్తున్నారు. అహ్మదాబాద్, కేవడియాలల్లోని వాటర్‌డ్రోమ్ టిక్కెట్ కౌంటర్ల వద్ద కూడా ఒక్కో టిక్కెట్‌కు 1500 రూపాయలు చెల్లించి కొనుక్కోవచ్చు.

బ్రిటిష్ కంపెనీ సూపర్‌మెరైన్ 1919 సెప్టెంబరులో ప్రపంచంలోనే మొదటిసారి ఫ్లయింగ్ బోట్ సేవలను అందుబాటులోకి తీసుకొచ్చింది. ఇంగ్లండ్‌లోని వూల్‌స్టన్ నుంచి ఫ్రాన్స్‌లోని లే హావ్రే వరకు ఈ సీప్లేన్ సేవలను ప్రవేశపెట్టింది. ఈ విమానం నీటి పైనుంచి టేకాఫ్ తీసుకోవడమే కాదు.. నీటిపైనే ల్యాండ్ అవుతుంది. ఈ సీ ప్లేన్‌ను స్పైస్ జెట్ సంస్థ నిర్వహిస్తుంది. ఈ విమానాన్ని ప్రత్యేకంగా మాల్దీవుల నుంచి తీసుకువచ్చారు. ఇది గంటకు 290 కిలోమీటర్ల వేగంతో ప్రయాణిస్తుంది. ఇందులో ఒక్కసారి ఇంధనం నింపితే సగటున 3 గంటలు ఎగరగలదు. ఇందులో 19 మంది ప్రయాణించవచ్చు.

మొత్తానికి సర్దార్ వల్లభాయ్ పటేల్ జయంతి సందర్భంగా ప్రధాని మోడీ ఎన్నో కీలక కార్యక్రమాలకు శ్రీకారం చుట్టారు. అందులో భాగంగానే సీ ప్లేన్ సేవలు ప్రారంభించడంతో ప్రజలు సీ ప్లేన్ లో ప్రయాణించేందుకు ఉవ్విళ్లూరుతున్నారు.



మరింత సమాచారం తెలుసుకోండి: