దుబ్బాకలో బైపోల్ వార్ పీక్ స్టేజ్ కి చేరింది. రేపు సాయంత్రం 5గంటలతో ప్రచార గడువు ముగుస్తుండటంతో పార్టీలు స్పీడ్ పెంచాయి. అన్ని పార్టీల అగ్రనేతలు కూడా దుబ్బాకలోనే మకాం వేశారు. తమ పార్టీ అభ్యర్థుల గెలుపు కోసం  చెమటోడుస్తున్నారు. రాష్ట్రంలో గతంలో ఏ ఉప ఎన్నికకు కష్టపడని విధంగా.. దుబ్బాక పై ఫోకస్ పెట్టాయి అన్ని పార్టీలు.

దుబ్బాక ఎన్నికల ప్రచారం క్లైమాక్స్‌కు చేరింది. నవంబర్‌ 1న సాయంత్రం 5గంటలతో ప్రచార గడువు ముగియనుండటంతో... పోటాపోటీగా ప్రచారం చేస్తున్నాయి ప్రధాన పార్టీలు. టీఆర్‌ఎస్‌ తన ప్రచారంలో ప్రధానంగా బీజేపీనే టార్గెట్‌ చేస్తోంది. టీఆర్‌ఎస్‌, బీజేపీ నాయకులు రాజకీయ ఆరోపణలతో పాటు వ్యక్తిగత విమర్శలకు దిగుతున్నారు.

దుబ్బాక ఉప ఎన్నికలో బీజేపీ నేతలు అసత్య ప్రచారం చేస్తున్నారంటూ మంత్రి హరీష్‌ రావ్‌ ఫైర్‌ అయ్యారు. బీజేపీ నేతలు ఝూటా మాటలు ప్రచారం చేస్తున్నారంటూ మండిపడ్డారు. వ్యవసాయ ‌మోటార్లకు విద్యుత్ మీటర్ల వంటి కేంద్ర నిర్ణయాలతో రైతులు నష్టపోతున్నారంటూ విమర్శించారు. దుబ్బాక అభివృద్ధి బాధ్యత తనదేనంటూ హామీ ఇస్తూ ఆర్థిక ‌మంత్రి హరీష్ రావు ప్రచారం సాగిస్తున్నారు.

తెలంగాణకు కేంద్రం నిధులివ్వలేదన్న కేసీఆర్ విమర్శల్ని తిప్పికొట్టారు బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్. టీఆర్ఎస్ నేతలు పంచుతున్న ఓట్ల డబ్బులెవరివని ప్రశ్నించారు. నిధుల లెక్కలపై  కేసీఆర్ చెబుతున్నవన్నీ అవాస్తవాలని.. కేంద్రం నిధులు ఇవ్వలేదని  నిరూపిస్తే... దుబ్బాక చౌరాస్తాలో ఉరివేసుకుని ప్రాణాలు వదులుతానని సవాల్ చేశారు సంజయ్.

అటు కాంగ్రెస్‌ నేతలు కూడా విస్తృతంగా ప్రచారం చేస్తున్నారు. రైతులు, విద్యార్ధులు, ఉద్యోగులు టీఆర్‌ఎస్‌ పట్ల విముఖత చూపిస్తున్నారని, కాంగ్రెస్‌ గెలుపు ఖాయమంటున్నారు హస్తం నేతలు.  ప్రస్తుతం మోడీ సర్కార్ రైతు వ్యతిరేక చట్టాలు చేస్తున్నారని.. వాటిని కేసీఆర్ ఎందుకు వ్యతిరేకించడం లేదో చెప్పాలన్నారు పీసీసీ చీఫ్‌ ఉత్తమ్‌.

పార్టీ నేతల మధ్య మాటల యుద్ధంతో దుబ్బాక ఉప ఎన్నిక ప్రచారం రణరంగాన్ని తలపిస్తోంది..మొత్తానికి ప్రచారానికి మరికొన్ని గంటలు మాత్రమే ఉండటంతో.. అన్ని ప్రధాన పార్టీలు మరింత స్పీడ్‌ పెంచాయ్‌.

మరింత సమాచారం తెలుసుకోండి: