ప్రభుత్వం ఏర్పడి రెండేళ్లు పూర్తి కాలేదు, అప్పుడే మంత్రి వర్గంపై సీఎం జగన్ అసంతృప్తితో ఉన్నారని, ఒకరిపై వేటు తప్పదనే పుకార్లు జోరందుకున్నాయి. టీడీపీ అనుకూల వెబ్ సైట్లు, సోషల్ మీడియా విభాగాలతో పాటు మెయిన్ స్ట్రీమ్ మీడియాలో కూడా కొన్నిరోజులుగా ప్రముఖంగా ఈ వార్త వినిపిస్తోంది. విచిత్రం ఏంటంటే.. టీడీపీనుంచి వచ్చే ఓ ఎమ్మెల్యేకోసం ఆ మంత్రి పదవిని ఖాళీ చేస్తున్నారట.

దున్నపోతు ఈనింది అంటే.. దూడను కట్టేయమన్నారట వెనకటికి.. అలా ఉన్నాయి వైసీపీ మంత్రివర్గంపై వస్తున్న పుకార్లు. వాస్తవానికి వైసీపీ మంత్రులే కాదు, ఎమ్మెల్యేలలో ఎవరిపైనా సీఎం జగన్ కి అసంతృప్తి లేదు. ఒక ఎంపీ మాత్రం బహిరంగంగానే జగన్ పై సవాళ్లు విసిరుతూ పార్టీ పరువుని బజారుకీడ్చారు. ఆయనపై కూడా పార్టీ అంతే సీరియస్ గా ఉందనే విషయం స్పష్టమైంది. ఇక మంత్రుల్లో దాదాపుగా అందరి పనితీరుపై సీఎం జగన్ సంతృప్తిగానే ఉన్నారు. ఎప్పుడూ ఏ శాఖ రివ్యూలో కూడా జగన్ అసంతృప్తి వ్యక్తం చేసిన దాఖలాలు లేవు. అలాంటిది ఏకంగా ఓ మంత్రిపై జగన్ ఎందుకు వేటు వేస్తారనేదే ప్రశ్న.

ఇక తాజా పుకార్ల విషయానికొస్తే.. విశాఖనుంచి ఇప్పటికే వాసుపల్లి గణేష్ టీడీపీనుంచి బైటకొచ్చి వైసీపీ తీర్థం పుచ్చుకున్నారు. నేరుగా వైసీపీ కండువా కప్పుకోకుండా తెలివిగా తన కుమారులిద్దర్నీ వైసీపీలో చేర్చారు. ఇదే బాటలో మరో ఎమ్మెల్యే గంటా శ్రీనివాస్ కూడా త్వరలోనే వైసీపీకి జై అంటారని తెలుస్తోంది. ఆయన కూడా తన కొడుకుల్ని వైసీపీలో చేర్చి తాను మాత్రం కండువాకి దూరంగా ఉంటారా? లేక తాను కూడా వైసీపీలో చేరి ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేస్తారా? అనేది సస్పెన్స్ గా మారింది. గంటా ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసి, తిరిగి ఎన్నికల్లో నిలబడి గెలిస్తే.. ఆయనకి జగన్ మంత్రి పదవి ఇస్తారనే ప్రచారం జోరుగా సాగుతోంది.
అయితే టీడీపీ అనుకూల సోషల్ మీడియా విభాగాల్లో ఏకంగా ఉత్తరాంధ్రకు చెందిన ఓ మంత్రికి పదవి తీసేసి మరీ దాన్ని గంటాకి అప్పగిస్తారని వార్తలొస్తున్నాయి. వీటన్నిటినీ వట్టి పుకార్లుగానే కొట్టిపారేస్తున్నాయి వైసీపీ వర్గాలు. తమ ఎమ్మెల్యేలు చేజారుతున్నారనే ఉద్దేశంతో.. టీడీపీ ఇలా వ్యతిరేక ప్రచారం చేయిస్తోందని మండిపడుతున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: