అవును..దాదాపు మళ్లీ ఏపీలో ఆ పండుగ జరుగుతోంది. ఆరేళ్ల తర్వాత ఏపీలో నవంబర్ ఒకటిని రాష్ట్ర అవతరణ దినోత్సవంగా నిర్వహింస్తున్నారు. రాష్ట్ర రాజధాని, జిల్లా కేంద్రాల్లోనూ ఆంధ్రప్రదేశ్ అవతరణ దినోత్సవం జరపాల్సిందిగా  జగన్ సర్కారు కొన్ని రోజుల క్రితమే ఆదేశాలు జారీ చేసింది. దీంతో మళ్లీ ఇప్పుడు ఏపీ అంతటా ఉత్సవ ఉత్సాహం చోటుచేసుకుంటోంది. ఆంధ్ర ప్రదేశ్ ఆవతరణ దినోత్సవాన్ని పురస్కరించుకుని సీఎం జగన్, గవర్నర్ హరిచందన్ రాష్ట్ర ప్రజలకు శుభాకాంక్షలు తెలిపారు.

రాష్ట్ర అవతరణ కోసం పోరాడిన అమరజీవి పొట్టి శ్రీరాములు, మరెందరో సమర యోధుల త్యాగాలు స్ఫూర్తినిచ్చాయని  సీఎం జగన్ అన్నారు. ఎందరో త్యాగ ధనుల స్పూర్తితో ఏర్పాటైన ఆంధ్రప్రదేశ్  రాష్ట్రంలో  అభివృద్ధి, సంక్షేమంలో ముందుకెళ్లాలని ఆకాంక్షించారు. రాష్ట్ర అవతరణ దినోత్సవం సందర్భంగా  గవర్నర్ బిశ్వ భూషణ్ హరిచందన్ ప్రజలకు  హృదయ పూర్వక శుభాకాంక్షలు తెలిపారు. అభివృద్ధి యొక్క ఫలాలు ప్రతి ఒక్కరికీ చేరేలా చూడాలని  గవర్నర్ బిశ్వ భూషణ్ హరిచందన్ ఆకాంక్షించారు
 
రాష్ట్ర ప్రభుత్వం నిరుపేదలకు అవసరమైన  సంక్షేమ,  అభివృద్ధి పథకాలను అమలు చేస్తోందన్న గవర్నర్..  ప్రజల ఆనందకరమైన జీవనమే ఏ ప్రభుత్వానికైనా విజయ సూచిక అని ప్రకటనలో తెలిపారు. రాబోయే రోజుల్లో పారదర్శకత, సుపరిపాలన ప్రభుత్వ ముఖ్య లక్షణంగా ఉండాలని ఆకాంక్షించారు. విజయవాడలోనూ.. జిల్లా కేంద్రాల్లోనూ నేడు రాష్ట్ర అవతరణ ఉత్సవాలు జరగనున్నాయి.

2014 వరకూ నవంబర్ 1న రాష్ట్ర అవతరణోత్సవాలు జరిగేవి.. అయితే ఆ తర్వాత 2014 జూన్ 2న తెలంగాణ ప్రత్యేక రాష్ట్రం కావడంతో మరోసారి ఏపీ అవతరణోత్సవాలపై చర్చ మొదలైంది. ఇప్పుడు రాష్ట్ర అవతరణ ఉత్సవం నవంబర్ 1న జరపాలా..జూన్ 2న జరపాలా అన్న చర్చ మొదలైంది. అసలే జూన్ 2 ఆంధ్ర ప్రజల అభీష్టానికి వ్యతిరేకంగా తెలంగాణ విడిపోయినందువల్ల జూన్ 2ను ఉత్సవం చేసుకోలేని పరిస్థితి. ఇలాంటి నేపథ్యంలో అప్పటి సీఎం చంద్రబాబు జూన్ 2 నుంచి జూన్ 8 వరకూ నవ నిర్మాణ దీక్షల పేరుతో గడిపేసేవారు.

అందువల్ల 2014 నుంచి ఏపీకి రాష్ట్ర అవతరణ ఉత్సవాలు లేకుండా పోయాయి. అయితే ఏ రాష్ట్రానికైనా రాష్ట్ర అవతరణ దినోత్సవం అంటూ తప్పకుండా ఉంటుంది. అలాంటిది అవతరణ దినోత్సవం జరుపుకోలేని స్థితిలోకి ఏపీ వెళ్లింది. అందుకే ఇప్పుడు ఆ పరిస్థితిని తొలగిస్తూ.. నవంబర్ ఒకటిని మళ్లీ ఏపీ అవతరణ దినోత్సవంగా జరపాలని ప్రభుత్వం నిర్ణయించడంతో మళ్లీ ఏపీకి పండుగొచ్చినట్టయింది.  

మరింత సమాచారం తెలుసుకోండి: