హైదరాబాద్ లో వరద సహాయం ఇప్పుడు హాట్ టాపిక్ అయింది. వరద సహాయం విషయంలో ఎన్నికల సంఘం తీసుకున్న నిర్ణయం వెనుక విపక్షాలు ఉన్నాయి అనే ఆరోపణలు అధికార పార్టీ నేతలు చేస్తున్న సంగతి తెలిసిందే. అయితే దీని వెనుక మా పాపం ఏమీ లేదని  విపక్షాలు అంటున్నాయి. ఇక ఇదిలా ఉంటే తాజాగా బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ రాష్ట్ర ప్రభుత్వంపై, సిఎం కేసీఆర్ పై తీవ్ర విమర్శలు చేసారు. వరద సాయంపై నాయకుల నుంచి ఎలాంటి లేఖ అందలేదని‌ ఎస్ఈసీ స్పష్టం చేశారని బండి సంజయ్ అన్నారు.

పాతబస్తీలో కరెంట్ బిల్లులు వసూలు చేసినప్పుడే‌‌ .. ప్రభుత్వానికి కేంద్రం నిధులిస్తోందని ఆయన పేర్కొన్నారు.  బీజేపీని సమర్థిస్తోన్న యువకులను చాలాన్ల పేర్లతో హింసిస్తున్నారు అని మండిపడ్డారు. నిజంగా నేనే లేఖ రాసి ఉంటే.. ప్రభుత్వం నాపై ఎందుకు చర్యలు తీసుకోవటం లేదు?  అని ఆయన ఆరోపణలు చేసారు. ఫోర్జరీ లేఖ గురించి నేను చేసిన ఫిర్యాదుపై పోలీసుల చర్యలు ఎందుకు తీసుకోవటం లేదు? అని ప్రశ్నించారు. బీజేపీని టీఆర్ఎస్ కంట్రోల్ చేయలేదన్న ఆయన.. ప్రజల కంట్రోల్లో మాత్రమే బీజేపీ ఉంటోందని చెప్పారు.

సమాజంలో 80శాతం ఉన్న హిందువుల మనోభావాలే మాకు ముఖ్యం అని ఆయన స్పష్టం చేసారు. భాగ్యలక్ష్మీ దేవాలయం గురించి టీఆర్ఎస్ నాయకులకు అవగాహన లేదు అని అన్నారు. బండి సంజయ్ భాగ్యలక్ష్మీ దేవాలయానికి వెళ్ళకూడదని ఎక్కడైనా రాసి ఉందా?  అని ప్రశ్నించారు. లేఖపై .. ఏ దేవాలయం దగ్గరైనా సీఎం కేసీఆర్ తో చర్చకు సిద్ధం అని ఆయన సవాల్ చేసారు. నిజమైన హిందువు కాదు కాబట్టి.. కేసీఆర్ మక్కా మసీదుకైనా వస్తారని భావించాను అని అన్నారు. కేసీఆర్, కేటీఆర్ లు అవాస్తవాలను ప్రచారం చేస్తున్నారు అని మండిపడ్డారు. మేము అధికారంలోకి వచ్చాక హైద్రాబాద్ లో ఉన్న 40వేల మంది రోహింగ్యా ముస్లింలను తరిమికొడతాం అని స్పష్టం చేసారు. ఓట్లు కోసమే 40వేల మంది రోహింగ్యాలను టీఆర్ఎస్ కాపాడుతోందన్నారు. పాకిస్తాన్, బంగ్లాదేశ్ నుంచి వారిని కేసీఆర్ కాపాడుతున్నాడు అని మండిపడ్డారు.

మరింత సమాచారం తెలుసుకోండి: