నేరాల నియంత్రణలో ఏపీ పోలీసులు ఎప్పటికప్పుడు కొత్త పంథా అవలంబిస్తున్నారు. నూతన సాంకేతిక విధానాలను అమలు చేస్తూ సరికొత్త పద్ధతుల్లో నేరాల నియంత్రణ, విచారణ ప్రక్రియను కొనసాగిస్తున్నారు. ఈ విషయంలో ఇప్పటికే జాతీయ స్థాయిలో ప్రశంసలు అందుకున్న ఏపీ పోలీస్.. ఇటీవల మతపరమైన సంస్థల వద్ద గట్టి నిఘా పెట్టి ఆకతాయిల ఆట కట్టించారు. మతపరమైన అలజడులు సృష్టించాలని చూస్తున్నవారిని పూర్తిగా నిలువరించగలిగారు.

మతపరమైన వివాదాలు సృష్టించేవారికి చెక్ పెట్టే విధానంలో భాగంగా.. రాష్ట్రంలోని దేవాలయాలు, చర్చిలు, మసీదుల వద్ద నిర్వాహకులే అప్రమత్తంగా మెలిగేలా పోలీసులు చర్యలు చేపట్టారు. రాష్ట్రంలోని ప్రార్థనా మందిరాల వద్ద సీసీ కెమెరాలు, బందోబస్తు ఏర్పాట్లను పక్కాగా చేపట్టారు. వాటి బందోబస్తుతోపాటు ఎటువంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా జాగ్రత్త వహించేలా నిర్వాహకులకు పలు సూచనలు ఇచ్చారు. పోలీస్‌ శాఖ పరిధిలో అన్ని జాగ్రత్తలు తీసుకుంటూనే మరోవైపు ఆలయాల నిర్వాహకులకు ఎప్పటికప్పుడు అందుబాటులో ఉంటున్నారు.

రాష్ట్రంలోని 57,270 మతపరమైన సంస్థల వద్ద సుమారు 9,268 ప్రాంతాల్లో ఇప్పటి వరకు 31వేల సీసీ కెమెరాలను అమర్చారు. మతపరమైన సంస్థలను జియో ట్యాగింగ్ తో మ్యాపింగ్ చేశారు. అన్ని ఆలయాల్లో అగ్నిమాపక జాగ్రత్తలు, భద్రతాపరమైన చర్యలు చేపట్టారు. ఈ ఏడాది సెప్టెంబర్‌ వరకు 33 ఆలయాల్లో జరిగిన నేరాలకు సంబంధించి 27 కేసుల్లో 130మందిని అరెస్ట్ చేశారు. గతంలో  54 ఆలయాల్లో జరిగిన నేరాలపై కూడా చట్టపరమైన చర్యలు తీసుకున్నారు. ఇక మతపరమైన సంస్థల వద్ద నేరాలు, అలజడులు, విధ్వంసాలు చేసే అలవాటున్న 1,196 మందిని బైండోవర్‌ చేశారు.

ఆమద్య వరుసగా ఏపీలోని ప్రార్థనా మందిరాల వద్ద అవాంఛనీయ ఘటనలు జరిగి నేపథ్యంలో పోలీసులు తీసుకున్న రక్షణాత్మక చర్యలు మంచి ఫలితాలనిచ్చాయి. ప్రజలను రెచ్చగొట్టి శాంతిభద్రతల సమస్య సృష్టించే శక్తులపై అప్రమత్తంగా వ్యవహరిస్తున్నారు పోలీసులు. ముఖ్యంగా సీసీ కెమెరాల ఏర్పాటు, కంట్రోల్ రూమ్ ల ఏర్పాటుతో నేరాల నియంత్రణలో ముందడుగు వేశారు. 

మరింత సమాచారం తెలుసుకోండి: