రాష్ట్రంలోని పేదలందరికీ డిసెంబర్ 25న ఇళ్ల పట్టాల పంపిణీ చేపడతామని ప్రభుత్వం ఈ పాటికే ప్రకటించింది. అయితే కేవలం కోర్టు వివాదాల్లో లేని స్థలాలను మాత్రమే పంపిణీ చేస్తామంటూ స్పష్టం చేసింది. మరి ఏయే ప్రాంతాల్లో కోర్టు వివాదాలున్నాయి. ఎక్కడెక్కడ డిసెంబర్ 25న ఇళ్ల పట్టాలు పంపిణీ చేస్తారు? లబ్ధిదారులకు సరైన సమాచారం ఉందా లేదా అని ఆరా తీస్తే.. చాలా ప్రాంతాల్లో ఈ పాటికే సచివాలయ అధికారులు ఇళ్ల పట్టాల లబ్ధిదారులకు పూర్తి సమాచారం అందించారని తెలుస్తోంది.

గతంలోనే లే అవుట్లు వేసి, హద్దు రాళ్లు ఏర్పాటు చేసిన ప్రభుత్వం, వాటి పట్టాలు ఇచ్చేందుకు మాత్రం చాలా రోజులు వేచి చూసింది. కోర్టు కేసులు ఉండటంతో... రాష్ట్రవ్యాప్తంగా జరగాల్సిన ఈ కార్యక్రమం పలు దఫాలు వాయిదా పడింది. చివరకు కోర్టు కేసులు ఉన్న స్థలాలను మినహాయించి ఇతర చోట్ల ఇళ్ల పట్టాలు ఇస్తామని ముందుకొచ్చింది. ప్రతి చోటా లేఔట్లను పరిశీలించి.. ప్లాట్లవారీగా నంబర్‌ రాళ్లు ఏర్పాటు చేయడంతోపాటు రహదారులకు ఇరువైపులా మొక్కలు నాటాలని ప్రభుత్వం ఈపాటికే అధికారులకు సూచించింది. లబ్ధిదారులకు ప్లాట్ల కేటాయింపులకు సంబంధించి లాటరీ పూర్తి కాని చోట్ల త్వరగా పూర్తి చేయాలని తహశీల్దార్లకు ఆదేశాలిచ్చింది. జిల్లాల వారీగా కోర్టు వివాదాలు లేకుండా పంపిణీకి సిద్ధం చేస్తున్న లేఔట్లు, లబ్ధిదారుల డేటా పంపాలని రెవెన్యూ శాఖ కలెక్టర్లను ఆదేశించింది.

రాష్ట్రవ్యాప్తంగా ఇళ్ల స్థలాల పంపిణీ కోసం 30,68,281 మంది అర్హులను ఎంపిక చేసి గతంలోనే సచివాలయాల నోటీసు బోర్డుల్లో జాబితాను పొందుపరిచారు. ఏవైనా కారణాలతో ఎక్కడైనా అర్హుల పేర్లు లబ్ధిదారుల జాబితాలో లేకపోతే మళ్లీ దరఖాస్తు చేసుకోవాలని ప్రభుత్వం సూచించింది. ఇలా వచ్చిన దరఖాస్తులను పరిశీలించి.. 90 రోజుల్లోగా ఎంపిక ప్రక్రియను పూర్తి చేసి స్థలాలు కేటాయిస్తామని ప్రకటించింది. ఇళ్ల పట్టాల పంపిణీ కోసం రాష్ట్రవ్యాప్తంగా 66,518 ఎకరాల భూమిని సేకరించి లేఔట్లు వేసి మౌలిక సదుపాయాలు కల్పిస్తున్నారు. చివరిలో దరఖాస్తు చేసుకుని అర్హులుగా ఎంపికైన 80 వేల మంది కోసం వచ్చే నెల 10లోగా స్థల సేకరణతోపాటు ప్లాట్ల గుర్తింపు ప్రక్రియ పూర్తి చేయాలని ఉన్నతాధికారులు ఆదేశించారు. స్థలాల పంపిణీతోపాటు వచ్చే నెల 25న 15 లక్షల ఇళ్ల నిర్మాణానికి భూమి పూజ కోసం ఏర్పాట్లు చేస్తున్నారు. 

మరింత సమాచారం తెలుసుకోండి: