రాష్ట్రంలో ఏపీ ప్రభుత్వం కొత్తగా 16 మెడికల్ కాలేజీల నిర్మాణం చేపట్టబోతోంది. అధికారంలోకి వచ్చిన ఏడాదిన్నరలోగా.. ఈ స్థాయిలో భారీగా మెడికల్ కాలేజీలను ఏర్పాటు చేస్తున్న ఏకైక ప్రభుత్వంగా వైసీపీ సర్కారు అరుదైన ఘనత సాధించిందని అంటున్నారు డిప్యూటీ సీఎం, రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి ఆళ్ల నాని. వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి సీఎం అయ్యాక  పాలనలో పారదర్శకత వచ్చిందని చెప్పారు. గత టీడీపీ ప్రభుత్వం రాష్ట్రంలో వైద్య ఆరోగ్యశాఖను భ్రష్టు పట్టించిందని, ఆరోగ్యశ్రీని మూలన పడేసిందని విమర్శించారాయన. గ్రామాల్లో, పట్టణాల్లో శిథిలావస్థకు చేరిన సి.హెచ్.సి., పి.హెచ్.సి., భవనాలకు కనీసం మరమ్మతులు కూడా చేయలేదని అన్నారు. జగన్ ప్రభుత్వంలో.. ప్రతి సచివాలయానికి అనుబంధంగా ప్రైమరీ హెల్త్ సెంటర్ ని ఏర్పాటు చేస్తున్నామని, చెప్పారు మంత్రి నాని.

రాష్ట్రంలో పేద, మధ్యతరగతి వారికి నాణ్యమైన వైద్యం అందుబాటులోకి తేవాలనేదే జగన్ ప్రభుత్వం సంకల్పం అని అన్నారు మంత్రి ఆళ్లనాని. రాష్ట్రంలో కొత్తగా 16 మెడికల్‌ కళాశాలల నిర్మాణం చేపడుతోందని, మరో 11 మెడికల్‌ కళాశాలలను ఆధునికీకరించబోతున్నామని పేర్కొన్నారు. రాష్ట్రంలో వివిధ ఆసుపత్రుల్లో, పి.హెచ్.సి.లలో ఖాళీగా ఉన్న 9,700 పోస్టులు భర్తీకి సంబంధించి నియామక ప్రక్రియ దాదాపుగా పూర్తయిందని, త్వరలో మరో 1,900 పోస్టుల భర్తీకి చర్యలు తీసుకుంటున్నామని చెప్పారు.

ఆరోగ్యశ్రీ పథకంలో విప్లవాత్మక మార్పులు తీసుకొచ్చింది వైసీపీ ప్రభుత్వం. ఆరోగ్యశ్రీలో అదనంగా పలు వ్యాధులను చేర్చింది. పలు ఆస్పత్రుల్లో ఆరోగ్యశ్రీ హెల్ప్ డెస్క్ ల పనితీరు మదింపు చేస్తోంది. ఆ వివరాలను సచివాలయాల్లో కూడా అందుబాటులో ఉంచుతోంది. ఇతర రాష్ట్రాల్లో ఉన్న ఆస్పత్రుల్లో కూడా ఆరోగ్యశ్రీ సేవలు అందుబాటులోకి తీసుకొచ్చింది. ఇక వైద్యం తర్వాత  ఇంటికి వెళ్లే సమయంలో కూడా నగదు సాయం చేస్తూ పేదలకు అండగా నిలబడుతోంది. ప్రస్తుతం ఉన్న ప్రభుత్వ ఆస్పత్రుల్లో కూడా నాడు-నేడు పేరుతో వసతులు మెరుగు పరిచేందుకు కృషిచేస్తున్నారు అధికారులు. ఇక కొత్తగా ఏర్పాటు చేస్తున్న 16 మెడికల్ కాలేజీలు అందుబాటులోకి వస్తే.. దేశంలోనే ఏపీ మెడికల్ హబ్ గా మారే అవకాశం ఉందని అంటున్నారు మంత్రులు.

మరింత సమాచారం తెలుసుకోండి: