ఏపీలో విచిత్రమైన వాతావరణం ఉన్న సంగతి విధితమే. నిమ్మగడ్డ రమేష్ కుమార్ రాష్ట్ర ఎన్నికల సంఘం ప్రధానాధికారిగా ఉన్నారు. ఆయనకు అధికారంలో ఉన్న వైసీపీ సర్కార్ కీ మధ్యన ఘర్షణ వాతావరణం నెలకొన్న సంగతి విధితమే. ఈ ఏడాది మార్చిలో నిమ్మగడ్డ స్థానిక ఎన్నికలను అర్ధాంతరంగా వాయిదా వేశారు. ఇపుడు ఆయన మళ్ళీ ఎన్నికలు జరపాలనుకుంటున్నారు. ఈ మధ్యలో చాలా పరిణామాలు వేగంగా జరిగాయి.

దీంతో నిమ్మగడ్డ విషయంలో కేంద్ర ఎన్నికల సంఘం దృష్టి సారించిందని అంటున్నారు. సీఈసీని కలవాలని ఆయనకు వర్తమానం పంపించినట్లుగా చెబుతున్నారు. అంతే కాదు మార్చిలో ఎన్నికలు వాయిదా వేసిన దగ్గర నుంచి ఈ రోజు వరకూ జరిగిన అనేక పరిణామాలను కూడా సీఈసీకి పూర్తిగా వివరించాలని కోరినట్లుగా ప్రచారం సాగుతోంది.

ఏపీలో నిమ్మగడ్డను తప్పించి చెన్నైకి చెందిన మాజీ జడ్జిని వైసీపీ సర్కార్ నియమించడంతో దాని మీద కోర్టులకు వెళ్ళి నిమ్మగడ్డ న్యాయ పోరాటం చేసి తిరిగి తన సీటును సంపాదించుకున్నారు. ఇక నిమ్మగడ్డ కేంద్ర హోం శాఖకు అప్పట్లో ఏపీ సర్కార్ మీద లేఖ రాసినట్లుగా కూడా ప్రచారంలో ఉంది. ఆ మీదట నిమ్మగడ్డ హైదరాబాద్ లోని ఒక హొటల్ లో టీడీపీ, బీజేపీకి చెందిన వారిని కలిశారని వార్తలు వచ్చాయి.

ఇలా ప్రతీ అంశం లోనూ అటూ ఇటూ వివాదాలు, ప్రచారాలు జరుగుతూండడంతో కేంద్ర ఎన్నికల సంఘం ఏపీ మీద దృష్టి పెట్టినట్లుగా చెబుతున్నారు. నిమ్మగడ్డను ఈ మొత్తం ఎనిమిది నెలలల్లో జరిగిన ప్రతీ పరిణామం గురించి వాకబు చేస్తార‌ని అంటున్నారు. మరి కేంద్ర ఎన్నికల సంఘం ఏ నిర్ణయం తీసుకుంటుంది. అది నిమ్మగడ్డకు అనుకూలంగా ఉంటుందా లేదా అన్నది చూడాలి. మొత్తానికి సీఈసీ నిమ్మగడ్డను పిలిపించింది అన్న వార్త మాత్రం వైరల్ అవుతోంది. కేంద్ర ఎన్నికల సంఘం ఏపీలో వివాదాలకు ఫుల్ స్టాప్ పెట్టేలా చూస్తుందా అన్నది కూడా చర్చగా ఉంది.



మరింత సమాచారం తెలుసుకోండి: