భార‌త్‌లో కరోనా కేసులు క్రమంగా పెరుగుతునే ఉన్నాయి. కేంద్ర ఆరోగ్యశాఖ రిలీజ్ చేసిన తాజా బులెటిన్లో పేర్కొన్న వివ‌రాల ప్ర‌కారం... దేశం‌లో కొత్తగా 45,209 కరోనా కేసులు నమోదయ్యాయి.  దేశవ్యాప్తంగా కోవిడ్‌ బాధితుల రికవరీ రేటు 93.69 శాతంగా ఉందని తెలిపింది. మొత్తం పాజిటివ్‌ కేసుల్లో 4.85 శాతం యాక్టివ్‌ కేసులున్నాయని, మరణాల రేటు 1.46 శాతంగా ఉందని బులెటిన్‌లో వెల్లడించింది.దీంతో ఇండియాలో ఇప్పటి వరకు నమోదైన మొత్తం కరోనా కేసుల సంఖ్య 90,95,807కి చేరింది.  ఇందులో 85,21,617 మంది కోలుకొని డిశ్చార్జ్ కాగా, 4,40,962 కేసులు యాక్టివ్ గా ఉన్నాయి.  ఇక గడిచిన 24 గంటల్లో ఇండియాలో కొత్తగా 501 మరణాలు సంభవించాయి.  దీంతో ఇండియాలో ఇప్పటి వరకు నమోదైన మొత్తం కరోనా మరణాల సంఖ్య 1,33,227కి చేరింది.  


మ‌రోవైపు దేశ రాజధాని ఢిల్లీలో సెకండ్ వేవ్ విజృంభిస్తోంది. ప్రతీ రోజూ పాజిటివ్ కేసుల సంఖ్య, మరణాల సంఖ్య పెరుగుతూనే ఉంది. ఈ నేపధ్యంలో వైరస్ వ్యాప్తిని కట్టడి చేసేందుకు ఢిల్లీ సర్కార్ కఠిన చర్యలు అమలు చేస్తోంది. మాస్క్ ధరించకుండా బయటకొచ్చినా, కోవిడ్ నిబంధనలను ఉల్లంఘించి బహిరంగ ప్రదేశాల్లో ఉమ్మినా, పొగాకు వాడినా, భౌతిక దూరాన్ని పాటించకపోయినా రూ. 2 వేలు భారీ జరిమానాను విధించనున్నట్లు వెల్లడించింది. అలాగే ఢిల్లీలో పెళ్లిళ్లకు కేవలం 50 మంది మాత్రమే హాజరు కావాలని తెలిపింది. అటు మార్కెట్లపై ఎల్లప్పుడూ నిఘా ఉంచుతామంది.


దేశ వ్యాప్తంగా కేసుల సంఖ్య పెరుగుతుండ‌గా తెలంగాణ‌లో మాత్రం కేసుల సంఖ్య తిరోగ‌మ‌నంలో ఉండ‌టం శుభ ప‌రిణామ‌మ‌నే చెప్పాలి.  తెలంగాణ‌లో తాజాగా గడిచిన 24 గంటల్లో రాష్ట్రంలో 873 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. దీంతో మొత్తం కేసుల సంఖ్య 2,63,526కి చేరింది. కొత్తగా వైరస్ బారినపడి నలుగురు మృత్యువాతపడ్డారు. దీంతో మొత్తం మరణాల సంఖ్య 1430కి పెరిగింది. ప్రస్తుతం రాష్ట్రంలో 11,643 యాక్టివ్ కేసులు ఉండగా.. 2,50,453 మంది కరోనా నుంచి కోలుకుని డిశ్చార్జ్ అయ్యారు. తాజాగా 1,296 మంది వైరస్ నుంచి కోలుకుని డిశ్చార్జ్ అయ్యారు. కాగా నిన్న ఒక్క రోజే 41,646 శాంపిల్స్ పరీక్షించగా.. మొత్తంగా టెస్టుల సంఖ్య 51,34,335కి చేరింది.

మరింత సమాచారం తెలుసుకోండి: