దేశంలో కరోనా మహమ్మారి మరోసారి పడగ విసురుతోంది. రోజురోజుకూ కరోనా కేసులు పెరిగిపోతున్నాయి. ఈ క్రమంలో ఈ వైరస్‌ను నిలువరించేందుకు పలు రాష్ట్రాలు నైట్ కర్ఫ్యూ విధించాలని నిర్ణయించిన విషయం తెలిసిందే. ఇప్పుడు ఈ రాష్ట్రాల జాబితాలో రాజస్థాన్ కూడా చేరింది. ఈ విధానాన్ని తొలుత మధ్యప్రదేశ్ ప్రభుత్వం అమల్లోకి తెచ్చింది. మొత్తం 5 జిల్లాల్లో నైట్ కర్ఫ్యూ విధిస్తున్నట్లు మధ్యప్రదేశ్ ప్రకటించింది. ఈ క్రమంలోనే రాజస్థాన్ కూడా ఇదే నిర్ణయాన్ని తీసుకున్నట్లు ప్రకటించింది. ఇక్కడ మొత్తం 8 జిల్లాల్లో నైట్ కర్ఫ్యూ అమలు చేయనున్నట్లు అధికారులు వెల్లడించారు.

కేబినెట్ సమావేశం తర్వాత ఈ నిర్ణయం తీసుకున్నట్లు ప్రభుత్వం తెలిపింది. జైపూర్, జోధ్‌పూర్, కోటా, బికనీర్, ఉదయ్‌పూర్, అజ్మర్, అల్వార్, భిల్వారా జిల్లాల్లో ఈ కర్ఫ్యూ విధిస్తున్నారు. ‘రాష్ట్రంలో కరోనా తీవ్రతపై కేబినెట్ సమావేశంలో చర్చించాం. కరోనా కేసులు ఎక్కువగా నమోదైన జిల్లాల్లో నైట్ కర్ఫ్యూ విధించాలని నిర్ణయించాం. మొత్తం 8 జిల్లాల్లో ఇది అమలవుతుంది. దీంతోపాటు కరోనా నియంత్రణకు అవసరమైన మరికొన్ని ప్రతిపాదనలపై కూడా ఆలోచిస్తున్నాం’ అని రాజస్థాన్ సీఎం అశోక్ గెహ్లాట్ చెప్పారు. అయితే దూర ప్రాంతాలకు వెళ్లిన వారు, అలాగే ఈ జిల్లాలకు వచ్చే వారు ఆదివారం రాత్రి వరకూ ఈ జిల్లాలకు రావొచ్చని తెలియజేశారు.

రాజస్థాన్‌లో ప్రతిరోజూ 1700 నుంచి 3వేల వరకూ కరోనా కేసులు నమోదవుతున్నట్లు ఆయన వెల్లడించారు. ఈ పరిస్థితిని చక్కదిద్దేందుకు ప్రయత్నిస్తున్నామని అధికారులు చెప్పారు. నైట్ కర్ఫ్యూ విధిస్తున్న 8 జిల్లాల్లో కరోనా కేసులు భారీగా నమోదయ్యాయిని, అందుకే ఈ నిర్ణయం తీసుకున్నామని వెల్లడించారు. అలాగే మాస్క్ లేకుండా బయటకు వచ్చేవారికి 200 రూపాయల నుంచి 500 రూపాయల వరకూ జరిమానా విధిస్తున్నట్లు తెలిపారు.

అయితే నైట్ కర్ఫ్యూ విధించడం వల్ల కరోనా ఎలా నియంత్రణలోకి వస్తుందని కొందరు సందేహాలు వ్యక్తం చేస్తున్నారు. దీని ఫలితాలు తెలియాలంటే కొంతకాలం వేచి చూడాల్సిందే.

మరింత సమాచారం తెలుసుకోండి: