ఎన్నికలు అంటే రాజకీయ పార్టీలకు మోజు పెరుగుతూంటే జనాలకు రాను రానూ ఇంటెరెస్ట్ తగ్గిపోతోంది. ఏ రాయి అయితేనేంటి పళ్ళూడగొట్టుకోవడానికి అన్నట్లుగా ఓటర్ల వైరాగ్యం ఉంది. అయిదేళ్ల కాల పరిమితికి ఓట్లు జనాల నుంచి గుంజుకుని పాత హామీలను మరచి మళ్ళీ మభ్యపెట్టేందుకు పార్టీలు ముందుకు వస్తూంటాయి. ఎన్నికల వేళ చేతిలో కాసింత  నగదు, మద్యం వంటివి అందించి ఓట్లేయించుకోవడం, మళ్ళీ అయిదేళ్ల వరకూ కనబడితే ఒట్టు అన్నట్లుగా రాజకీయ పార్టీల  సీన్ ఉంటోంది.

దీంతో గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికలు ఇపుడు జనాలకు అనాసక్తిని కలిగిస్తున్నాయట. మామూలుగా అయితే ఏమో కానీ రెండు నెలల క్రితం వచ్చిన భారీ వరదలు హైదరాబాద్ ని ముంచేశాయి. దాంతో అలా మునిగిన కాలనీలు చాలానే ఉన్నాయి. అక్కడి జనాలకు తమ బతుకు ఏంటో తెలియడంలేదు.

ఇపుడు నాయకులు వచ్చి ఓట్లు వేయమంటే చిర్రెత్తుకువస్తోందిట. నిజానికి వరద‌లతో జనం బాగా  అల్లాడిపోయారు. ఆ బాధ కళ్ల ముందు ఉండగానే ఒక్కసారిగా  ఎన్నికలు పెట్టేశారు. ఇపుడు తమ కోపాన్ని ఎవరికీ ఓట్లు వేయకుండా తీర్చుకోవాలని వరదలలో నిండా మునిగిన కాలనీల వాసులు భావిస్తున్నారుట.

దాంతో నోటాకే ఓటు తప్ప ఏ నాయకుడికీ, పార్టీలకు కానే కాదని వారు ముఖం మీద చెప్పేస్తున్నారు. ప్రచారానికి వెళ్ళిన ప్రతీ పార్టీకి ఇదే విధమైన అనుభవం  కలుగుతోందిట. షేక్ పేట సహా అనేక కాలనీలలో ఇదే రకమైన పరిస్థితి ఉంది. ఓట్లు పాడు చేసుకోవద్దు, మీకు నచ్చిన పార్టీలకు వేయండి అని అభ్యర్ధులు  నచ్చచెబుతున్నా వినడంలేదుట. మొత్తం మీద చూసుకుంటే టీయారెస్, బీజేపీల మధ్య ఉన్న బిగ్ ఫైట్ కాస్తా ఇపుడు త్రిముఖ పోటీగా మారే అవకాశం ఉందిట. నోటాతో పోటీ పడాల్సివస్తోందిట. మరి చూడాలి నోటా అందరి కన్నా మొనగాడు అవుతుందో ఎవరి కొంప ముంచుతుందో. ఎవరి జాతకాలు మారుస్తుందో ఏమిటో.





మరింత సమాచారం తెలుసుకోండి: